సినిమా షూటింగ్‌కు వెళ్తుండగా ప్రమాదం.. ఇద్దరి మృతి
తంజావూరు: తమిళనాడులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ సినిమా షూటింగ్ బృందానికి చెందిన ఓ వ్యక్తితో సహా ఇద్దరు వ్యక్తులు మరణించారు. తంజావూరు జిల్లా కుంభకోణం వద్ద సినిమా షూటింగ్ బృందం వెళ్తున్న వ్యాన్, ఎదురు వస్తున్న లారీ ఢీకొనడంతో ఇద్దరు అక్కడికక్కడే మరణించగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను కుంభకోణం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. శుక్రవారం రాత్రి ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు తెలిపారు.
గత 15 రోజులుగా కుంభకోణం పరిసర ప్రాంతాల్లో ప్రముఖ నటుడు, దర్శకుడు ప్రభుదేవా నటిస్తున్న 'యంగ్ మంగ్ సంగ్' అనే తమిళ సినిమా షూటింగ్ జరుగుతోంది. శుక్రవారం తిరువాయరులోని అయ్యరప్పర్ దేవాలయంలో షూటింగ్ జరిగింది. ఈ సినిమా యూనిట్‌కు సంబంధించిన కొందరు వ్యాన్‌లో భోజనాలు తీసుకుని వస్తుండగా ప్రమాదం జరిగింది. వ్యాన్ డ్రైవర్ విజయ్ కుమార్, సినిమా యూనిట్‌కు చెందిన అరుముగం అనే వ్యక్తి అక్కడికక్కడే మరణించారు.