- కేంద్ర మంత్రి సిద్ధేశ్వర్
దావణగెరె : పదేళ్ల యూపీఏ ప్రభుత్వ పాలనలో ఆర్థిక పరిస్థితి దివాళా తీసిందని, దీంతో పున శ్చేతనం చేసేందుకు పలు కఠిన చర్యలు తీసుకోవడం అనివార్యమైందని పౌర విమాన యాన శాఖ సహాయ మంత్రి జీఎం.సిద్ధేశ్వర్ అన్నారు. ఆదివారం ఆయన నగరంలో జన సంపర్క కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు.
రైలు చార్జీల పెంపు ప్రతిపాదన గత కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ సర్కారే చేపట్టిందని, దాన్ని ఇప్పుడు అమలు చేశామన్నారు. రైల్వే ప్రయాణ ధరల పెంపు అనివార్యమైందన్నారు. ప్రయాణికులకు సురక్షిత ప్రయాణం, భద్రత, సౌకర్యాల కల్పన కోసం ఈ ధరల పెంపుదల అనివార్యమైందన్నారు. దేశ ప్రజలకు ఉత్తమ సేవలు అందిస్తూ రైతులకు మద్దతు ధరలు, ఉద్యోగావకాశాలు కల్పించాలనే ఉద్దేశ్యంతోనే ప్రజలు కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారని తెలిపారు.
హరిహర-బెంగళూరు మధ్య ఇంటర్ సిటీ రైలు సౌకర్య కల్పన విషయాన్ని త్వరలోనే రైల్వే శాఖ మంత్రి సదానందగౌడ దృష్టికి తీసుకె ళతానన్నారు. విపక్ష ముఖ్య సచేతకులు డాక్టర్ శివయోగిస్వామి మాట్లాడుతూ... ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ నాలుగు స్థానాలు కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మాజీ మంత్రి ఎంపీ. రేణుకాచార్య, మాజీ ఎమ్మెల్యే ఎస్‌వీ.రామచంద్ర, జిల్లా బీజేపీ అధ్యక్షుడు అణబేరు జీవనమూర్తి, కొండజ్జి జయప్రకాశ్, యశవంతరావ్ జాదవ్ పాల్గొన్నారు.