
విజయవాడ మా తాతగారి ఊరు: సింధు
విజయవాడ రావడం చాలా ఆనందంగా ఉందని, ఇది తమ తాతగారి ఊరని పీవీ సింధు వెల్లడించింది.
విజయవాడ: అందరి సహకారంతో భవిష్యత్ లో మరిన్ని విజయాలు సాధిస్తానని బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు తెలిపింది. కోచ్ గోపీచంద్, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఒలింపిక్ మెడల్ సాధించానని చెప్పింది. ఇందిరా గాంధీ స్టేడియంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన సన్మానసభలో ఆమె మాట్లాడుతూ.. తనకు మద్దతుగా నిలిచిన ప్రజలకు, ప్రోత్సహిస్తున్న ప్రభుత్వానికి ఆమె కృతజ్ఞతలు తెలిపింది.
విజయవాడ రావడం చాలా ఆనందంగా ఉందని, ఇది తమ తాతగారి ఊరని వెల్లడించింది. చిన్నప్పుడు సెలవుల్లో తాతగారింటికి వచ్చేదాన్నని చెప్పింది. గోపీచంద్ ఆడేటప్పుడు చూసి స్ఫూర్తి పొందానని చెప్పింది. అందరి ఆశీస్సులు, అండదండలతో ఇక్కడి దాకా వచ్చానని సింధు ధన్యవాదాలు తెలిపింది.
కరణం మల్లీశ్వరికి చేసిన సన్మానం చూసి ప్రేరణ పొందానని, ఆ స్ఫూర్తితోనే ఆల్ ఇంగ్లండ్ చాంపియన్షిప్ సాధించానని పుల్లెల గోపీచంద్ వెల్లడించారు. తనకు సన్మానం చేసినందుకు ఏపీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపాడు.