
క్రీడలకు కేంద్రంగా అమరావతి: చంద్రబాబు
అమరావతిని క్రీడలకు కేంద్రంగా మలుస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.
విజయవాడ: అమరావతిని క్రీడలకు కేంద్రంగా మలుస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. అమరావతిలో క్రీడలకు మంచి వసతులు కల్పిస్తామని, స్పోర్ట్స్ సిటీ ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. ఇందిరా గాంధీ స్టేడియంలో మంగళవార మధ్యాహ్నం జరిగిన కార్యక్రమంలో ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు, ఆమె కోచ్ గోపీచంద్ లను ఆయన ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ... సింధు దేశానికి గర్వకారణమన్నారు. సింధును ప్రోత్సహించినందుకు ఆమె తల్లిదండ్రులకు అభినందనలు తెలిపారు. రియో ఒలింపిక్స్ లో దేశానికి సింధు ఆశాదీపంలా మారిందని కొనియాడారు. పతకాలు సాధించిన వారికి ప్రోత్సహం లేకపోవడం వల్లే క్రీడలకు ఆదరణ లేకుండా పోతోందన్నారు. క్రీడలను ప్రోత్సహించేందుకు ముందుటామని చెప్పుకొచ్చారు.
సింధు ఏం కావాలన్నా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. సింధుకు రూ. 3 కోట్లు నగదు, 1000 గజాల స్థలం, గ్రూప్-1 ఉద్యోగం ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు. బ్యాడ్మింటన్ క్రీడాకారుడు కిదాంబి శ్రీకాంత్ కు రూ. 25 లక్షలు, గ్రూప్-2 ఉద్యోగం ఇస్తామని హామీయిచ్చారు.