
సింధుతో షటిల్ ఆడిన చంద్రబాబు
ఒలింపిక్స్ లో వెండి పతకం సాధించిన బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధును ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఘనంగా సత్కరించారు.
విజయవాడ: ఒలింపిక్స్ లో వెండి పతకం సాధించిన బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధును ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఘనంగా సత్కరించారు. విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో మంగళవారం మధ్యాహ్నం జరిగిన కార్యక్రమంలో సింధుతో పాటు కోచ్ పుల్లెల గోపీచంద్ ను గజమాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వేదికపై సింధుతో చంద్రబాబు సరదాగా బ్యాడ్మింటన్ ఆడారు.
సింధు, గోపీచంద్ లకు ఆంధ్రపదేశ్ మంత్రులు, ఎమ్మెల్యేలు పుష్ప గుచ్ఛాలతో అభినందనలు తెలిపారు. ఈ ఉదయం గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్న సింధు, గోపీచంద్ కు మంత్రులు ఘనస్వాగతం పలికారు. తర్వాత విమానాశ్రయం నుంచి ఇందిరాగాంధీ స్టేడియం వరకు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. సింధుకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. దారిపొడవునా పూలతో స్వాగతించారు. విజయోత్సవ వేడుకలో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.