
బాలా దర్శకత్వంలో మరోసారి
దర్శకుడు బాలా పేరు గుర్తుకు రాగానే సేతు, నందా, పితామగన్, పరదేశీ ఇలా పలు దృశ్యకావ్యాలు కళ్ల ముందు సాక్షాత్కరిస్తాయి. బాలా చిత్రాల్లో కథ, కథనాలు వైవిధ్యంగా ఉంటూ వాస్తవానికి దగ్గరగా ఉంటాయి. కాంప్రమైజ్ అన్న పదాన్ని దరిదాపుల్లోకి రానీయని దర్శకుడు బాలా. ప్రస్తుతం ఈ జాతీయ ఉత్తమ అవార్డు గ్రహీత తారాతప్పట్లై అనే చిత్రాన్ని చెక్కుతున్నారు. కాగా తదుపరి చిత్రానికి సంభందించిన చర్చలకు బాలా తెర లేపినట్లు తాజా సమాచారం. ప్రత్యేకత ఏమిటంటే బాలా, నటుడు విక్రమ్ కాంబినేషన్‌లో మరో చిత్రం తెరకెక్కడానికి సన్నాహాలు జరుగుతున్నాయని తెలిసింది.
విక్రమ్‌కు సేతు చిత్రంతో లైఫ్ ఇచ్చిన దర్శకుడు, పితామగన్ చిత్రంతో జాతీయ ఉత్తమ నటుడు అవార్డును గెలుచుకునేలా చేసిన దర్శకుడు బాలా అన్నది గమనార్హం. అలాంటి బాలా, విక్రమ్‌లు ఇటీవల కలిసినట్లు, కథా చర్చలు జరిపినట్లు సమాచారం. బాలా తన కథలోని విక్రమ్ పాత్రను మాత్రమే ఆయనకు వివరించినట్లు అది విక్రమ్‌ను ఇంప్రెస్ చేసినట్లు కోలీవుడ్ టాక్. కాగా వీరి కాంబినేషన్‌లో త్వరలోనే చిత్రం ప్రారంభం కానుందనే ప్రచారం కోడంబాక్కంలో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. విక్రమ్ నటించిన 10 ఎండ్రదుక్కుళ్ చిత్రం ఇటీవల తెరపైకి వచ్చింది. ఇప్పుడాయన ఆనంద్ శంకర్ దర్శకత్వంలో మర్మమనిదన్ చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. ఈ చిత్రం తరువాత బాలా చిత్రం చేస్తారని సమాచారం.