తమిళసినిమా: దర్శకుడు బాలా ఇంటి ముందు సినీ నిర్మాత ధర్నా చేయడం కోలీవుడ్‌లో కలకలం రేపింది. వివరాలు.. సేతు, పితామగన్, నంద వంటి పలు విజయవంతమైన చిత్రాల దర్శకుడు బాలా. వీటిలో పితామగన్ చిత్ర నిర్మాత వీఏ దురై. 2003లో విక్రమ్, సూర్య హీరోలుగా బాలా దర్శకత్వంలో నిర్మించిన భారీ చిత్రం పితామగన్ మంచి విజయాన్ని సాధించింది. అంతేకాకుండా ఆ చిత్రంలో నటించిన విక్రమ్‌కు జాతీయ అవార్డులు తెచ్చిపెట్టింది. అయితే భారీ బడ్జెట్ కారణంగా నిర్మాతకు మాత్రం లాభాన్ని అందించలేదు. దీంతో ఈ చిత్రం నిర్మాతకు మరో చిత్రం చేసి పెడుతానని బాల అప్పట్లో మాట ఇచ్చారట.
అందుకు ఆయనకు నిర్మాత అడ్వాన్సుగా రూ.10 లక్షలు ఇచ్చారట. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు బాల నిర్మాత వీఏ దురైకు చిత్రం చేయలేదు. తీసుకున్న అడ్వాన్స్ కూడా తిరిగి చెల్లించ లేదు. ప్రస్తుతం ఆర్థిక కష్టాల్లో ఉన్న నిర్మాత వీఏ దురై నటుడుగా మారి ఒక చిత్రంలో విలన్‌గా నటిస్తున్నారు. కాగా ఈయన తనకు చేసే చిత్రంపై బాలాను పలుమార్లు అడిగినా సరైన సమాధానం చెప్పడం లేదని దీంతో తాను ఇచ్చిన అడ్వాన్సును తిరిగి చెల్లించాలని కోరినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
దీంతో మంగళవారం చెన్నైలోని దర్శకుడు బాలా కార్యాలయానికి వచ్చి డబ్బులు ఇవ్వాల్సిందిగా అడిగారు. దీంతో బాలా అనుచరుడు ఆయన్ని కార్యాలయం నుంచి బయటకు నెట్టేసినట్లు సమాచారం. దీంతో నిర్మాత దురై బాలా కార్యాలయం ముందే ధర్నాకు దిగారు. దీంతో నిర్మాతల సంఘం సభ్యులు వీఏ దురైతో ఫోన్లో మాట్లాడి ధర్నాని ఉపసంహరింపజేశారు. దీంతో నిర్మాత దురై అక్కడ నుంచి వెళ్లిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment