విక్రమ్, సూర్య, కార్తీలతో మల్టీస్టారర్ చిత్రం
విక్రమ్, సూర్య, కార్తీ నటించే భారీ మల్టీస్టారర్ చిత్రానికి సన్నాహాలు జరుగుతున్నాయన్నది తాజా సమాచారం. ఇది ఒక హాలీవుడ్ చిత్రానికి రీమేక్ అన్నది గమనార్హం. వివరాల్లోకెళితే హాలీవుడ్‌లో వారియర్స్ పేరుతో తెరకెక్కి వసూళ్ల వర్షం కురిపించిన చిత్రాన్ని ఇప్పుడు బాలీవుడ్‌లో పునర్‌నిర్మిస్తున్నారు. అక్షయకుమార్, సిద్ధార్ధ్ మల్హోత్రా, జాకీష్రాఫ్ ప్రదాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కరణ్ మల్హోత్రా దర్శకత్వం వహిస్తున్నారు.
నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది. కాగా ఈ మల్టీస్టారర్ చిత్రాన్ని తమిళం, తెలుగు భాషల్లో రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. తమిళంలో విక్రమ్, సూర్య, కార్తీలను నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలిసింది. ఇక తెలుగులో ప్రభాస్,రామ్‌చరణ్, రాణాలను నటింప జేయడానికి చర్చలు సాగుతున్నట్లు సమాచారం.అత్యంత భారీ బడ్జెట్‌లో రూపిందనున్న ఈ చిత్రానికి శంకర్ లాంటి స్టార్ దర్శకుడిని ఎంపిక చేసే పనిలో ఉన్నట్లు తెలిసింది.ఇద్దరు సహోదరులు ఒక బాక్సింగ్ శిక్షకుడి ఇతివృత్తంతో రూపొందనున్న ఈ క్రేజీ చిత్రం గురించి పూర్తి వివరాలు తెలియాలంటే మరి కొంచెం రోజులు ఆగాల్సిందే.