సాక్షి, చెన్నై: డీఎంకే ఎమ్మెల్యే ఇదయవర్మన్‌కు మద్దతుగా చెంగోడు గ్రామం కదిలింది. ఆయనే లేకుంటే గ్రామంలో రక్తం ఏరులై పారి ఉండేదని, ఆయన్ను విడుదల చేయాలని పట్టుబడుతూ పోలీస్‌స్టేషన్ ఎదుట మంగళవారం గ్రామస్తులు బైటాయించారు. చెంగల్పట్టు జిల్లా తిరుప్పోరూర్ సమీపంలోని చెంగోడు గ్రామంలో డీఎంకే ఎమ్మెల్యే ఇదయ వర్మన్ ఫైరింగ్ వివాదానికి దారి తీసిన విషయం తెలిసిందే. స్థల వివాదం ఈ ఫైరింగ్‌కు కారణంగా ఉన్నా, ఎమ్మెల్యేను అధికార పక్షం టార్గెట్ చేసింది. నకిలీ తుపాకుల్ని కల్గినట్టుగా పేర్కొంటూ, కేసులు నమోదుచేసిన కటకటాల్లోకి ఎమ్మెల్యేను నెట్టారు. ఈ పరిస్థితుల్లో మంగళవారం చెంగోడు గ్రామం ఏకమైంది. ఎమ్మెల్యేకు మద్దతుగా పోలీసుస్టేషన్ వైపు కదిలారు. (పరిస్థితి ఉద్రిక్తం.. ఎమ్మెల్యే ఫైరింగ్)
తిరుప్పోరూర్ పోలీసు స్టేషన్‌ఎదుట గ్రామస్తులు బైటాయించారు. ఎమ్మెల్యేను విడుదల చేయాలని నినదిస్తూ ఆందోళన చేపట్టారు. కరోనా సమయంలో నిరసనలు వద్దు అని పోలీసులు వారించినా, గ్రామస్తులు ఏ మాత్రం తగ్గలేదు. మాస్క్‌లు ధరించి, భౌతిక దూరాన్ని అనుసరిస్తూ నిరసనకు దిగారు. అమ్మ మక్కల్‌మున్నేట్ర కళగం నేత కుమార్ మద్దతుదారులు, కిరాయి ముఠాలు సంఘటన జరిగిన రోజున కత్తులు, కర్రలతో వీరంగం సృష్టించాయని గ్రామస్తులు గుర్తు చేశారు.
ఎమ్మెల్యే తండ్రి లక్ష్మీ పతి ప్రశ్నించగా, హతమార్చేంతగా పరిస్థితి చోటుచేసుకుందని, తమపై కత్తులతో కిరాయి ముఠా దూసుకొచ్చిందని, ఆ సమయంలో అక్కడకు వచ్చిన ఎమ్మెల్యే ఇదయవర్మన్ కాల్పులు జరపకుండా ఉండి ఉంటే, గ్రామంలో ఈ పాటికి రక్తం ఏరులై పారి ఉండేదని, పదుల సంఖ్యలో మరణాలు చోటుచేసుకుని ఉండేదని చెంగోడు గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేపై పెట్టిన కేసును ఎత్తి వేయాలని నినదిస్తూ గ్రామస్తులు బైటాయించడంతో పోలీసు ఉన్నతాధికారులు రంగంలోకి దిగి బుజ్జగించాల్సి వచ్చింది. (చెత్తకుప్ప పక్కనే అందమైన అమ్మాయిని చూసి..)
Comments
Please login to add a commentAdd a comment