బీజేపీని వదిలి పెట్టం: పవన్ కల్యాణ్
హైదరాబాద్: బీజేపీపై ప్రముఖ సినీనటుడు, జన సేన అధినేత పవన్ కల్యాణ్ నిప్పులు చెరిగారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎన్నికల సమయంలో ఎన్నికల మేనిఫెస్టోలో ప్రత్యేక హోదా అంశం పెట్టి ఇప్పుడు మాత్రం ఆ పార్టీ వెనక్కి వెళ్లిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఐదు అంశాలపై ట్విట్టర్‌లో స్పందించనున్నానంటూ పవన్ కల్యాణ్ చెప్పిన విషయం తెలిసిందే. అందులో భాగంగా తొలుత గోవధ, రోహిత్ వేముల ఆత్మహత్య, సినిమా థియేటర్లలో జాతీయగీతం ప్రదర్శనపై స్పందించిన ఆయన ఆదివారం నాలుగో అంశంగా ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ ఎలా వ్యవహరించిన తీరుపై స్పందించారు.
దాదాపు దశాబ్దంపాటు ఎన్నో రకాలుగా తమ గౌరవాన్ని దెబ్బకొట్టి, అవమానించి, చివరకు రాజధాని కూడా లేకుండా పెద్ద మొత్తంలో రెవిన్యూలోటుతో ఆంధ్రులను గెంటేశారని ఆవేదన వ్యక్తం చేశారు. చివరకు కేంద్రం చెప్పిన ప్రత్యేక హోదా ప్రత్యేక ప్యాకేజీగా వచ్చిందని, ప్రత్యేక ప్యాకేజీ అనేది ఒక కంటితుడుపు చర్య అని అభివర్ణించారు. బీజేపీ ఇచ్చిన ప్రత్యేక ప్యాకేజీలో ప్రత్యేకం అనే పదం తప్ప అందులో ప్రత్యేకంగా ఏమీ లేదని దుయ్యబట్టారు.
ఆంధ్రులు వెన్నెముక లేనివాళ్లుగా ఆత్మగౌరవం లేనివాళ్లుగా బీజేపీ చూస్తోందని ధ్వజమెత్తారు. జై ఆంధ్ర ఉద్యమ సమయంలో 400మందికి పైగా యువకులు తమ పోరాటంలో అసువులు బాశారని ఆ విషయంలో ఆంధ్రులు ఎప్పటికీ మర్చిపోరని అన్నారు. జైఆంధ్ర ఉద్యమంలో ప్రాణాలుకోల్పోయిన 400 మంది విద్యార్థులపై ప్రమాణం చేసి చెబుతున్నామని, బీజేపీ ఏ హామీ ఇచ్చిందో దానిపై సమాధానం చెప్పకుండా విడిచిపెట్టే సమస్యే లేదని ఆయన స్పష్టం చేశారు.