పవన్ ముందు నీ భవిష్యత్తు చూసుకో!
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో సాయం చేస్తుందని బీజేపీ ఏపీ ఇన్‌చార్జ్ సిద్ధార్థనాథ్ సింగ్ తెలిపారు. బొంబాయి రాష్ట్రం నుంచి విడిపోయే సమయంలో గుజరాత్ ఏపీ కంటే వెనుకబడి ఉండేదని, కానీ ఇప్పుడు దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా నిలిచిందని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నట్టు ఆయన గుర్తు చేశారు.
ఏపీకి ప్రత్యేక సాయం అందించినందుకు రాష్ట్ర బీజేపీ నేతలు శనివారం ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఢిల్లీలో సిద్ధార్థనాథ్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ జనసేన అధ్యక్షుడు, సినీ నటుడు పవన్ కల్యాణ్ తీరును తప్పుబట్టారు. పవన్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. భావోద్వేగాలతో అభివృద్ధి సాధ్యం కాదని పేర్కొన్నారు. బీజేపీ భవిష్యత్ లేదన్న పవన్ ముందు తన భవిష్యత్ ఏమిటో చూసుకోవాలని హితవు పలికారు. పవన్ ఎన్డీయేలో ఉంటారా? లేదా? అన్నది ఆయన ఇష్టమని సిద్ధార్థనాథ్ సింగ్ స్పష్టం చేశారు. పవన్ పాచిపోయిన లడ్డూల గురించి స్పందిస్తూ.. నిధులు పాచిపోవు.. మాటలే పాచిపోతాయని పేర్కొన్నారు.
బీజేపీ ఎంపీ హరిబాబు మాట్లాడుతూ ఏపీకి ప్రత్యేక సాయాన్ని ప్రజల్లోకి తీసుకెళుతామని చెప్పారు. ఇందుకోసం తిరుపతి, విశాఖపట్టణం, విజయవాడలలో బహిరంగ సభలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ సభలకు కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ హాజరవుతారని చెప్పారు. ఏ రాష్ట్రానికి ఇవ్వనివిధంగా ఏపీకి సాయం చేశారని అన్నారు.