'పవన్.. ఎవరో రాసిన స్క్రిప్టు చదవడం కాదు'
హైదరాబాద్: సినీ నటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌కు ప్రజల పైన, వారి సమస్యలపైన నిజంగా చిత్తశుద్ది ఉన్నవాడైతే ఆయన పూర్తి స్థాయి నాయకుడుగా పనిచేసేవాడని బీజేపీ ఆంధ్రప్రదేశ్ శాఖ వ్యాఖ్యానించింది. పార్టీ అధికార ప్రతినిధి ఆంజనేయరెడ్డి, జాతీయ యువమోర్చా కార్యవర్గ సభ్యుడు రమేష్ నాయుడు శనివారం నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం చేస్తున్న ఆర్థిక సహాయాన్ని పవన్‌కల్యాణ్ పాచి లడ్డులతో పోల్చడాన్ని వారు తీవ్రంగా ఖండించారు.
రాజకీయాలంటే సినిమాలు తీసుకోవడమో.. ఎవరో రాసిన స్క్రిప్టును చదువుతూ పంచ్ డైలాగులు కొట్టడం కాదని సూచించారు. ప్రజలకు న్యాయం చేయాలన్న చిత్తశుద్ధి ఉంటే పూర్తిస్థాయి రాజకీయ నాయకుడగా మారాలని సవాల్ విసిరారు. రాజకీయ నాయకుడుగా ఎంత సడన్‌గా తెరపైకి వస్తాడో.. అంతే సడన్‌గా కనిపించకపోతాడంటూ పవన్‌ను ‘హిట్ అండ్ రన్’ పొలిటిషియన్‌గా పోల్చారు. ప్రజారాజ్యం పార్టీ పెట్టి ఆ తర్వాత దానిని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన తన అన్నయ్య గురించి కూడా నిన్నటి సభలో మాట్లాడి ఉంటే బాగుండేదని ఎద్దేవా చేశారు. మొన్నటి సాధారణ ఎన్నికల్లో ఎన్డీయేకు మద్దతు ఇచ్చిన నేతగా ఆయనంటే తమ పార్టీకి ఎంతో గౌరవమని.. బీజేపీని అనవసరంగా విమర్శలు చేయడం మానుకోవాలని సూచించారు.