రేప్లపై ప్రధాని, గవర్నర్ ఏం చేస్తున్నారు?
- దేశరాజధానిలో చిన్నారులపై వరుస అఘాయిత్యాలు సిగ్గుచేటు
- ఢిల్లీ పోలీసులు, ప్రధాని మోదీ, ఎల్జే నజీబ్ జంగ్ల తీరుపై సీఎం కేజ్రీవాల్ మండిపాటు
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో చిన్నారులపై అత్యాచారాలు తరచూ జరుగుతుండటం సిగ్గుచేటని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. సామూహిక అత్యాచారానికిగురై ప్రస్తుతం జీటీబీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాళ్లను ఆయన పరామర్శించారు.ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ కూడా ఆయన వెంట వచ్చారు. ఈ సందర్భంగా ఢిల్లీ పోలీసులు, ప్రధాని నరేంద్ర మోదీ, లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ లపై కేజ్రీవాల్ తీవ్రఆగ్రహం వ్యక్తం చేశారు.
'ఆడపిల్లలను కాపాడుకోవటంలో పోలీసులు పూర్తిగా విఫలమయ్యారు. ప్రధాని, లెఫ్టినెంట్ గవర్నర్ లు ఏం చేస్తున్నట్లు?' అని ట్విట్టర్ ద్వారా ప్రశ్నించారు. ఢిల్లీలో పోలీసులపై పెత్తనం కేంద్రం చేతుల్లో ఉండటంవల్లే తాము అనుకున్న రీతిలో దుండగులను దండించే వీలు లేకుండా పోతోందని కేజ్రీవాల్ గతంలోనూ చాలాసార్లు చెప్పిన సంగతి తెలిసిందే.
పశ్చిమఢిల్లీలో ఇంటి బయట ఆడుకుంటున్న రెండున్నర ఏళ్ల పాపను దుండగులు అపహరించి, గ్యాంగ్ రేప్ చేశారు. ఆమె ఇంటి సమీపంలోని పార్కు దగ్గర తీవ్ర రక్తస్రావంతో అపస్మారక స్థితిలో ఉన్న ఆ చిన్నారిని ఇరుగుపొరుగు వారు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ కేసులో ఇంతవరకు ఎవరినీ అదుపులోకి తీసుకోలేదు. తూర్పు ఢిల్లీ ఆనంద్ విహార్ ప్రాంతంలో జరిగిన మరో సంఘటనలో ఇంట్లో ఒంటరిగా ఉన్న ఐదేళ్ల పాపను పొరుగున ఉండే వ్యక్తి కిడ్నాప్ చేసి, స్నేహితులతో కలిసి దారుణానికి ఒడిగట్టాడు. ఈ ఘటనకు సంబంధించి ముగ్గుర్ని పోలీసులు అరెస్ట్ చేశారు.
Repeated rape of minors is shameful and worrying. Delhi police has completely failed to provide safety. What are PM n his LG doing?
— Arvind Kejriwal (@ArvindKejriwal) October 17, 2015
Am on my way to hospitals to meet rape victims
— Arvind Kejriwal (@ArvindKejriwal) October 17, 2015