కేంద్రం అసలు టార్గెట్ నేనే... కార్తీ కాదు..
చెన్నై: కేంద్రం గురి అంతా తన మీదే ఉందని మాజీ మంత్రి , కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం వ్యాఖ్యానించారు. తన కుమారుడు కార్తీని అడ్డం పెట్టుకుని తనను ఇరకాటంలో పెట్టేందుకు తీవ్ర కుట్రలు సాగుతున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్ జాతీయ రాజకీయల్లో కీలక నేతగా ఉన్న పి.చిదంబరం కుటుంబం మీద ఇటీవల కాలంగా ఆరోపణల సంఖ్య పెరుగుతున్న విషయం తెలిసిందే. శారదా చిట్ ఫండ్ కేసులో ఆయన సతీమణి నళిని చిదంబరం ప్రమేయం ఉన్నట్టుగా ఓవైపు విచారణ సాగుతోంది. అలాగే, ఆయన తనయుడు కార్తీ చిదంబరం మెడకు ఐఎన్‌ఎక్స్ మీడియా, వాసన్ హెల్త్ కేర్‌లోకి విదేశీ పెట్టుబడుల రాక వ్యవహారాలు ఉచ్చుగా మారి ఉన్నాయి.
ఇటీవల సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ల దాడుల పర్వం సాగాయి. విచారణ వేగవంతం అయింది. కార్తీ విదేశాల్లో ఉండటంతో, రాగానే, అరెస్టుకు తగ్గ ప్రయత్నాలు సాగుతున్నట్టు ప్రచారం ఊపందుకుని ఉంది. ఈ పరిస్థితుల్లో ఓ మీడియాతో నిన్న చిదంబరం మాట్లాడుతూ, కేంద్రం గురి తన కుమారుడు కాదు అని, తానేనని వ్యాఖ్యానించారు. తనను ఇరకాటంలో పెట్టడం, తనను అణగదొక్కడం లక్ష్యంగా తీవ్ర కుట్రలకు కేంద్రం వ్యూహరచన చేసి ఆచరణలో పెట్టే పనిలో నిమగ్నం అయిందని ఆరోపించారు.
తన కుమారుడు అన్ని విచారణలకు సరైన సమాధానం ఇస్తారని పేర్కొంటూ, తనను గురిపెట్టి, కొత్త ఎత్తుగడలకు సీబీఐ సిద్ధం అవుతోన్నట్టు సంకేతాలు వెలువడుతున్నాయని అనుమానం వ్యక్తం చేశారు. సీబీఐని అడ్డం పెట్టుకుని సాగుతున్న ప్రయత్నాలకు కాలమే సమాధానం ఇస్తుందని, ప్రజలు అన్నీ గమనిస్తున్నారని వ్యాఖ్యానించారు.