భార్య నుంచి రక్షణ కల్పించండి
తిరువళ్లూరు:ప్రియుడితో కలిసి భర్తపై కత్తితో దాడి చేసిన భార్యపై పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని, కుటుంబ సభ్యులతో కలిసి కలెక్టర్ కార్యాలయం వద్ద భర్త నిరాహార దీక్షకు పూనుకున్నారు. తిరువళ్లూరు జిల్లా తిరుత్తణి తాలుకా కొట్టయూర్ ప్రాంతానికి చెందిన త్యాగరాజన్ కుమారుడు విజయమూర్తికి తిరుత్తణికి చెందిన భాగ్యలక్ష్మీకి మూడేళ్ల క్రితం వివాహం జరిగింది. ప్రస్తుతం వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ క్రమంలో భాగ్యలక్ష్మికి అదే ప్రాంతానికి చెందిన జానకి రామన్‌తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఇది తెలిసి పద్ధతి మార్చుకోవాలని భార్యను పలు సార్లు హెచ్చరించాడు.
దీంతో భాగ్యలక్ష్మి తన ప్రియుడు జానకిరామన్‌తో సహజీనం చేస్తుండగా, విజయమూర్తి తన తల్లిదండ్రులతో కలిసి నివాసం ఉంటున్నాడు. తిరుత్తణిలో ఆటో నడుపుతూ జీవనం కొనసాగిస్తున్న విజయమూర్తిని భార్య భాగ్యలక్ష్మీ, ఆమె ప్రియుడు జానకి రామన్, అతని స్నేహితులు రవి, బలరామన్ కలిసి ఈనెల 17న తిరుత్తణిలో కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. దాడి సమయంలో విజయ మూర్తి గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు కాపాడి 108 ద్వారా తిరుత్తణి వైద్యశాలకు తరలించారు. ఇతనికి తల, కాళ్లు, చేతులు తదితర ప్రాంతాల్లో బలమైన గాయాలు వున్నాయి.
ఫిర్యాదు స్వీకరణకు నిరాకరణ
తన పై దాడి చేసిన భార్య, ఆమె ప్రియుడితోపాటు అతని స్నేహితులపై చర్యలు తీసుకోవాలని విజయమూర్తి తిరుత్తణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే అక్కడ పోలీసులు ఫిర్యాదు తీసుకోవడానికి నిరాకరించారు. దీంతో బాధితుడు, తల్లి, తండ్రి, అన్నతో కలిసి బుధవారం ఉదయం ఎస్పీ శరవణన్‌ను కలిసి వినతి పత్రం సమర్పించారు. తనపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని వినతి పత్రంలో పేర్కొన్నారు. అయినా ఫలితం లేకపోవడంతో ఆగ్రహించిన విజయమూర్తి, గురువారం ఉదయం కలెక్టర్ కారుకు ఎదురుగా కూర్చుని నిరసన తెలిపారు.
తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవడంతో పాటు, తమ కేసుపై ఉదాసీనతగా వ్యవహరించిన పోలీసులపైనా చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు సంఘటనా స్థలంలోకి చేరుకుని ఆందోళనకారులతో చర్చించి వారిని కలెక్టర్ వద్దకు తీసుకెళ్లారు. కలెక్టర్‌కు ఇచ్చిన వినతి పత్రాన్ని పరిశీలించిన ఆయన బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.