- నేడు చిక్కబళ్లాపురంలో ఎత్తినహొళె పథకానికి శంకుస్థాపన
- విచ్చేయనున్న సీఎం సిద్ధరామయ్య
- పథకం అంచనా వ్యయం రూ.12 వేల కోట్లు
- 28 టీఎంసీల నీరు లభ్యం
- పరమశివయ్య నివేదికలో భాగమే ఎత్తినహొళె
కోలారు/చిక్కబళ్లాపురం, న్యూస్‌లైన్ : నిత్యం కరువు కోరల్లో చిక్కుకునే కోలారు, చిక్కబళ్లాపురం జిల్లావాసుల స్వప్నం సాకారం కాబోతోంది. ఈ రెండు జిల్లాలకు శాశ్వత తాగు, సాగునీటిని అందించేందుకు రూపొందించిన ఎత్తినహొళె పథకానికి రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్య సోమవారం చిక్కబళ్లాపురంలోని బీజీఎస్ వర్‌డ స్కూల్ మైదానంలో ఉదయం 10 గంటలకు శంకుస్థాపన చేయనున్నారు. ఉభయ జిల్లాలతో పాటు బయలు సీమ జిల్లాలకు
సాగునీటిని అందించాలని దశాబ్దాలుగా రైతులు ఆందోళన చేస్తూ వచ్చారు. నీటిపారుదల రంగం నిపుణుడు పరమశివయ్య నివేదికను అమలు చేసి పడమటి కనుమల నుంచి వృథాగా సముద్రంలోకి వెళ్లే నేత్రావతి నీటిని బయలు సీమ జిల్లాలకు మళ్లించాలని ప్రజలు, రైతు సంఘాలు, సంఘ సంస్థలు ఉద్యమించాయి. పోరాటాల ఫలితంగా గత బీజేపీ ప్రభుత్వం పరమశివయ్య నివేదికలోని ఒక భాగమైన ఎత్తిన హొళె పథకం అమలు చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం అప్పట్లో రూ. 8 వేల కోట్లను బడ్జెట్‌లో కేటాయించింది.
ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 12 వేల కోట్ల మేర అంచనా వ్యయాన్ని పెంచి ఎత్తినహొళె పథకానికి కేబినెట్‌లో ఆమెదం తెలిపింది. టెండర్ ప్రక్రియ పూర్తవ్వడంతో నేడు పథకాన్ని లాంఛనంగా ప్రారంభించనుంది. కార్యక్రమానికి రాష్ట్ర జలవనరుల శాఖా మంత్రి ఎంబీ.పాటిల్, కేంద్రమంత్రులు వీరప్పమొయిలీ, కేహెచ్.మునియప్ప, మాజీ ప్రధాని హెచ్‌డీ.దేవెగౌడ, జిల్లా ఇన్‌చార్జ్‌మంత్రి రోషన్‌బేగ్, రవాణాశాఖా మంత్రి రామలింగారెడ్డి, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖా మంత్రి యుటీ.ఖాదర్, మాజీ ముఖ్యమంత్రులు జగదీశ్‌శెట్టర్, డీవీ.సదానందగౌడ జిల్లాలోని ఎమ్మెల్యేలు, కలెక్టర్ విశాల్ తదితరులు పాల్గొనున్నారు.
ఎత్తినహొళె పథకానికి అనేకులు వ్యతిరేకం : ఇదిలా ఉండగా ఎత్తినహొళె పథకాన్ని ప్రభుత్వం కంటి తుడుపు చర్యగానే చేపడుతోందని కొన్ని సంఘాలు ఆరోపిస్తున్నాయి. చిక్కబళ్లాపురం జిల్లాల్లో ఎత్తినహొళె ప్రారంభాన్ని బ్లాక్‌డేగా పరిగణించి శాశ్విత నీటిపారుదల పోరాట సమితి ఆందోళనలు చేస్తోంది. పరమశివయ్య నివేదిక అమలు ద్వారా తమ ప్రాంతానికి నీటి సమస్య ఎదురువుతుందని, ఈ పథకాన్ని వ్యతిరేకిస్తూ దక్షిణ కన్నడ జిల్లా బంద్‌కు పిలుపు నిచ్చారు.
పరమశివయ్య నివేదికలో భాగమే.. : మధ్య కర్ణాటకలోని బయలుసీమ జిల్లాల్లో భవిష్యత్తులో భయంకర క్షామం ఏర్పడుతుందని యోచించిన నీటిపారుదల రంగం నిపుణుడు డాక్టర్ పరమశివయ్య 30 ఏళ్ల క్రితమే పడమటి కనుమల నుంచి వృథాగా సముద్రంలోకి వెళ్లే 2500 టీఎంసీల నీటిలో 120 టీఎంసీల నేత్రావతి నీటిని బయలుసీమలోని 9 జిల్లాలకు మళ్లించాలని ప్రభుత్వానికి నివేదికను అందించారు. కానీ పాలకులు ఆ నివేదికను మూలన పడేశారు.