సాక్షి, న్యూఢిల్లీ: ఆప్ ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు మద్దతు ఇచ్చేది లేదని కాంగ్రెస్ మంగళవారం మరోసారి స్పష్టం చేసింది. కాంగ్రెస్ మీడియా సెల్ ఇన్‌చార్జ్ అజయ్ మాకెన్ ట్విటర్‌లో ఈ విషయం తెలిపారు. ‘రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కాంగ్రెస్ ఎటి ్టపరిస్థితిలోనూ ఆమ్ ఆద్మీ పార్టీకి మద్దతు ఇవ్వదు. క్రితంసారి ఆప్ నాయకులు ఓటర్ల ఆకాంక్షలను కూలదోసి పారిపోయారు’ అని మాకెన్ ట్విటర్‌లో పేర్కొన్నారు. మాకెన్ సందేశం కాంగ్రెస్ అధికారిక ట్విటర్ ఖాతా నుంచి పోస్టు అయింది. డీపీసీసీ అధికార ప్రతినిధి ముకేశ్ శర్మ కూడా ఆప్ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వబోమని మంగళవారం పునరుద్ఘాటించారు.
మోడీ ప్రభజంనాన్ని తగ్గించేందుకు కాంగ్రెస్ ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటుకు ఆమ్ ఆద్మీ పార్టీకి మద్దతు ఇవ్వవచ్చన్న ఊహాగానాలు కొద్ది రోజులుగా వినిపిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ తన వైఖరిని స్పష్టం చేసింది. ఆప్ కూడా తాను కాంగ్రెస్‌తో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయబోనని అంటోంది. అయితే ప్రస్తుతం మోడీ హవాను తట్టుకోలేం కాబట్టి కాంగ్రెస్ లేదా బీజేపీ సాయంతో ప్రభుత్వం ఏర్పాటు చేద్దామంటూ కొందరు ఆప్ ఎమ్మెల్యేలు కేజ్రీవాల్‌కు సూచించినట్టు వార్తలు వచ్చాయి. ఆప్‌లో మెజారిటీ ఎమ్మెల్యేలు ఇదే అభిప్రాయంతో ఉన్నట్టు తెలుస్తోంది. మళ్లీ ఎన్నికలు వస్తే ఓడిపోతామనే భయంతో ఉన్న ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని అధిష్టానాన్ని కోరుతున్నారని మంగళవారం ఓ ఆంగ్ల దినపత్రిక కథనం ప్రచురించింది. దీంతో మాకెన్ ట్వీట్ ప్రాధాన్యం సంతరించుకుంది.దేశవ్యాప్తంగా మోడీ వీస్తుండడతో బీజేపీ కూడా తాజా ఎన్నికలకే మొగ్గు చూపింది. ఈ నేపథ్యంలో అక్టోబరులో ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయని చెబుతున్నారు.
ఎల్జీతో కేజ్రీవాల్ భేటీ
ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మంగళవారం లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్‌ను కలిశారు. ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణపై విషయమై లెఫ్టినెంట్ గవర్నర్‌తో మాట్లాడడానికి కేజ్రీవాల్ రాజ్‌నివాస్‌కు వెళ్లారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఆయన వెంట ఆప్ సీనియర్ నాయకుడు మనీశ్ సిసోడియా సైతం ఉన్నారు.ఈ భేటీ తరువాత వీళ్లిద్దరు మీడియాతో మాట్లాడేందుకు ఆసక్తి చూపలేదు. జన్‌లోక్‌పాల్ బిల్లును ఆమోదించడానికి కాంగ్రెస్, బీజేపీ అడ్డుపడ్డాయని ఆరోపిస్తూ కేజ్రీవాల్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడం తెలిసిందే. దీంతో ఫిబ్రవరి 14 నుంచి ఢిల్లీలో రాష్ట్రపతి పాలన కొనసాగుతోంది. ఢిల్లీలో అసెంబ్లీని రద్దు చేసి వెంటనే ఎన్నిక లు జరిపించాలని ఆప్ డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు అది సుప్రీంకోర్టును సైతం ఆశ్రయించింది.
ఆప్‌కు మద్దతు ఇవ్వం
Published Tue, May 20 2014 11:04 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement