మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి రాఖీ బిర్లా
న్యూఢిల్లీ: నగరంలో మహిళా సురక్షా దళాలను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోందని మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి రాఖీ బిర్లా తెలిపారు. ఆమె శుక్రవారం ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. మహిళలకు రక్షణ కల్పించడంతో లింగ సమానత్వంపై ప్రజల్లో అవగాహన పెంచడం ప్రధానమని ఆమె అభిప్రాయపడ్డారు. మహిళా సురక్షా దళాల ఏర్పాటుపై ఆమె మాట్లాడుతూ.. నగరంలో మహిళల రక్షణ కోసం మహిళా సురక్షా దళాల(ఎంఎస్‌డీ)ను ఏర్పాటుచేసేందుకు తగిన విధి విధానాలు రూపొందిం చాలని ప్రధాన కార్యదర్శి నాయకత్వంలో అత్యున్నతస్థాయి కమిటీని గత జనవరిలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిందన్నారు.
ఆ కమిటీ ఫిబ్రవరి 15వ తేదీ తర్వాత తన నివేదికను అందజేస్తుందని చెప్పారు. ఈ దళాలు ముఖ్యంగా వేధింపుల కేసుల్లో మహిళలకు అండగా నిలబడతాయన్నారు. ‘ఈ ఎంఎస్‌డీలో చేరేందుకు మహిళలు చాలామంది స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. నాకు ఇప్పటివరకు చాలా ఈమెయిల్స్ అందాయి. సుమారు 150 మందికి పైగా యువతులు స్వయంగా వచ్చి నన్ను కలిశారు..’ అని బిర్లా వివరించారు. నగరంలోని ప్రతి నియోజకవర్గంలో 20 కి పైగా ఎంఎస్‌డీ బృందాలు సేవలందించేలా ప్రణాళికలు రూపొం దిస్తున్నామని ఆమె తెలిపారు. బృంద సభ్యులకు తగిన శిక్షణ ఇప్పిస్తామన్నారు. ఈ బృందాలు ఆయా నియోజకవర్గాల్లో సంచరిస్తూ ఆపదలో ఉన్న మహిళలకు అండగా నిలుస్తాయని చెప్పారు. దీంతోపాటు లింగవివక్షకు వ్యతిరేకంగా నగరంలో వీధినాటకాలు, అవగాహన శిబిరాలను నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోందని మంత్రి బిర్లా తెలిపారు.
త్వరలో మహిళా సురక్షా దళాలు
Published Sat, Feb 8 2014 1:17 AM | Last Updated on Sat, Sep 2 2017 3:27 AM
Advertisement