ఎరగా నగదు
డీఎంకేపై వైగో ఆగ్రహం
ప్రజా కూటమిలోకి విజయకాంత్‌కు ఆహ్వానం
చెన్నై : ఎండీఎంకేను నిర్వీర్యం చేయడానికి మహా కుట్ర జరుగుతోందని ఆ పార్టీ నేత వైగో ఆగ్రహం వ్యక్తం చేశారు. తన పార్టీ వర్గాలకు నగదు, పదవుల్ని ఎరగా వేస్తూ డీఎంకే వైపుకు తిప్పుకునే ప్రయత్నం చేయడం సిగ్గు చేటు అని మండిపడ్డారు. ఇక, ప్రజా కూటమిలోకి రావాలని డీఎండికే అధినేత విజయకాంత్‌కు పిలుపునిచ్చారు.
ఎండీఎంకే నుంచి వలసల పర్వం సాగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన పలువురు కీలక నేతలు మళ్లీ పాత గూటికే (డీఎంకే)లోకి చేరే పనిలో పడ్డారు. మరి కొందరు అన్నాడీఎంకే వైపు మొగ్గు చూపుతున్నారు. తాజాగా, ఎండీఎంకేకు బలం అత్యధికంగా ఉన్న నియోజకవర్గాల మీద డీఎంకే కన్నేసింది. అక్కడి ఆ పార్టీ ముఖ్య నాయకుల్ని తమ వైపు ఆకర్షించేందుకు శ్రీకారం చుట్టి, కార్యరూపం దాల్చే పనిలో డీఎంకే వర్గాలు పడ్డాయి.
ఎక్కడెక్కడ జంప్ జిలానీలు ఉన్నారో వారిని పసిగట్టే పనిలో పడ్డ ఎండీఎంకే నేత వైగో, వారు పార్టీ ఫిరాయించకుండా చూసేందుకు తీవ్రంగానే శ్రమిస్తున్నారు. బలం ఉన్న ప్రాంతాల్లో పర్యటిస్తూ పార్టీ వర్గాలకు భరోసా ఇస్తున్నారు. ఇందులో భాగంగా తన పార్టీని దెబ్బతీసేందుకు మహా కుట్ర జరుగుతున్నదంటూ గురువారం వైగో తీవ్రంగానే స్పందించారు. ఈ కుట్రకు వ్యూహకర్త డీఎంకే కోశాధికారి ఎంకే స్టాలిన్ అని నిప్పులు చెరిగారు. పధకం ప్రకారం తనను, తన పార్టీని టార్గెట్ చేసి స్టాలిన్ ముందుకు సాగుతున్నట్లుందని ధ్వజమెత్తారు.
ఈ ప్రయత్నాలను, కుట్రను ఎదుర్కొని తన బలాన్ని చాటుకుంటానని ప్రకటించారు. కొన్ని చోట్ల తన పార్టీ వర్గాలకు నగదు, పదవులు ఇస్తామంటూ ప్రలోభాలకు గురిచేస్తున్నట్లు సమాచారం అందిందన్నారు. దీన్ని బట్టి చూస్తే, డీఎంకే ఎంతగా దిగజారుడు నీచ రాజకీయాలు సాగిస్తోందో స్పష్టమైందని దుయ్యబట్టారు. ఇక, డీఎండీకే అధినేత విజయకాంత్ ప్రజా కూటమికి అనుకూలంగా వ్యాఖ్యలు చేసిన విషయాన్ని మీడియా గుర్తు చేయగా, అందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఎండీఎంకే, వీసీకే, సీపీఎం, సీపీఐలతో ఏర్పడిన ఈ ప్రజా కూటమిలోకి డీఎండీకే అధినేత విజయకాంత్ కూడా రావాలని ఎదురు చూస్తున్నామని, ఆయనకు ఆహ్వానం సైతం పలికామన్నారు.
ఒకవేళ విజయకాంత్ ప్రజా కూటమిలోకి వస్తే, ఆయన్నే సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తారా? అన్న ప్రశ్నకు.. ఆయన వస్తే ఆనందమేనని, అయితే ప్రజా కూటమికి నాయకత్వం ఎవరు వహించాలన్నది అందరూ చర్చించుకుని సమష్టి నిర్ణయం తీసుకుంటామన్నారు.
'విజయకాంత్ మా కూటమిలోకి రండి'
Published Fri, Dec 18 2015 9:08 AM | Last Updated on Sun, Sep 3 2017 2:12 PM
Advertisement