సాక్షి, బళ్లారి :
మాజీ ముఖ్యమంత్రి, కేజేపీ అధ్యక్షుడు యడ్యూరప్ప బీజేపీలోకి రావడం నూటికి నూరు పాళ్లు ఖాయమని, ఆయన్ను పార్టీలోకి చేర్పించుకునే విషయంపై బీజేపీ హైకమాండ్ నేతలు అంగీకారం కూడా తెలిపారని మాజీ ఉప ముఖ్యమంత్రి కేఎస్ ఈశ్వరప్ప పేర్కొన్నారు. ఆయన శనివారం నగరంలోని కోర్టు ఆవరణంలో విలేకరులతో మాట్లాడారు. యడ్యూరప్ప కూడా బీజేపీలోకి రావడానికి సుముఖత చూపారని, రాష్ట్ర బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఆయన రాకను స్వాగతిస్తున్నారని గుర్తు చేశారు. యడ్యూరప్ప, శ్రీరాములు పార్టీ నుంచి విడిపోవడంతోనే కాంగ్రెస్‌కు అధికారంలోకి రావడానికి సాధ్యమైందన్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లోపు వారిద్దరిని బీజేపీకి రప్పించుకునేందుకు పార్టీ పెద్దలకు తెలియజేసినట్లు తెలిపారు. శ్రీరాములును కూడా బీజేపీలోకి పిలిపించుకోవాలని సూచించామని, హైకమాండ్ తగిన నిర్ణయం తీసుకుంటుందని అన్నారు.
శాసనసభ ఎన్నికల్లో తాము ఎందుకు ఓడిపోయామో ఆత్మావలోకనం చేసుకున్నామని, తిరిగి అలా జరగకుండా పార్టీని బలోపేతం చేస్తామని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు చేసింది ఏమీ లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు విసిగిపోయారని, తమ బీజేపీ ప్రభుత్వం పాలన భేష్‌గా ఉండేదని ప్రజలు చర్చించుకుంటున్నారని తెలిపారు. సిద్ధరామయ్య అనాలోచిత నిర్ణయాల వల్ల ఆ పార్టీలోనే అసంతృప్తి జ్వాలలు భగ్గుమంటున్నట్లు తెలిపారు. ఆయన ముఖ్యమంత్రిగా తీసుకుంటున్న నిర్ణయాలు ఒక్కటి కూడా సరైనని లేవన్నారు. సిద్ధరామయ్య ముఖ్యమంత్రి కావాలని కురుబలు, దళితులు ఓట్లు వే స్తే.. ఆ వర్గాల వారికి కూడా ఆయన చేసింది ఏమీ లేదన్నారు. గోహత్య నిషేధాన్ని ఎందుకు రద్దు చేశారని ప్రశ్నించారు.
ముస్లిం ఓట్ల కోసం కాంగ్రెస్ పార్టీ లేనిపోని పథకాలను రూపొందిస్తోందని మండిపడ్డారు. అయితే ఆ వర్గాలు సిద్దూ పాలనను చీదరించుకుంటున్నట్లు గుర్తు చేశారు. తాము చేసిన తప్పులకు ప్రజలు గుణపాఠం చెప్పారని, అయితే కాంగ్రెస్ కూడా ఆ తప్పులే చేస్తోందని అన్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. లాటరీ ద్వారా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఎలాంటి మేలు చేయడం లేదన్నారు. మాజీ ఎమ్మెల్సీ సుశీల్ నమోషి, నాయకులు రామలింగప్ప, గాదిలింగప్ప, యువమోర్చా నాయకులు సుధీర్ కుమార్ పాల్గొన్నారు.
త్వరలో బీజేపీలోకి యడ్డి రాక
Published Sun, Dec 1 2013 3:41 AM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM
Advertisement
Advertisement