యడ్డికి నేడు బీజేపీ ఆహ్వానం | BJP today to yadyurappa | Sakshi
Sakshi News home page

యడ్డికి నేడు బీజేపీ ఆహ్వానం

Published Sat, Dec 28 2013 3:22 AM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM

BJP today to yadyurappa

సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, కేజేపీ అధ్యక్షుడు యడ్యూరప్పను బీజేపీలో చేర్చుకోవడానికి అన్ని లాంఛనాలు పూర్తయ్యాయి. పార్టీలో చేరాల్సిందిగా శనివారం ఆయనకు అధికారికంగా ఆహ్వానం అందనుంది. నగరంలో శుక్రవారం జరిగిన పార్టీ కార్యవర్గ సమావేశంలో యడ్యూరప్ప పునరాగమనానికి అంగీకారం తెలుపుతూ తీర్మానాన్ని ఆమోదించారు. ఈ సమాచారాన్ని ఆయనకు తెలియజేయడం ద్వారా పార్టీలోకి అధికారికంగా ఆహ్వానించాలని నిర్ణయించారు. పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ప్రహ్లాద జోషి, ఎంపీ అనంత కుమార్, మాజీ ముఖ్యమంత్రులు సదానంద గౌడ, జగదీశ్ శెట్టర్ ప్రభృతులు యడ్యూరప్పను ఆయన నివాసంలో కలుసుకుని పార్టీ నిర్ణయాన్ని తెలియజేయనున్నారు.
 
చప్పట్లతో సమ్మతి
 
కార్యవర్గ సమావేశంలో అనంత కుమార్ మాట్లాడుతూ పార్టీని వదలి వెళ్లిన నాయకులను తిరిగి ఆహ్వానించడానికి చప్పట్లు కొట్టడం ద్వారా అంగీకారం తెలపాలని సూచించారు. దీంతో సమావేశంలో పాల్గొన్న వారంతా జోరుగా చప్పట్లు చరిచారు. వచ్చే లోక్‌సభ ఎన్నికలను బీజేపీ సమైక్యంగా ఎదుర్కొంటుందన్నారు. బయటకు వెళ్లిపోయిన వారంతా తిరిగి రావడం ద్వారా పార్టీకి పూర్వ వైభవం లభించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కొన్ని కారణాల వల్ల కొందరు నాయకులు పార్టీని వీడారని, వారిని తిరిగి తీసుకు రావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. కాంగ్రెస్ రహిత భారత్‌ను నెలకొల్పాలన్న పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ పిలుపు మేరకు అందరూ పార్టీ విజయం కోసం శ్రమించాలని ఆయన కోరారు.
 
యడ్యూరప్ప సమాలోచనలు
 
బీజేపీలోకి రావాలంటూ అధికారిక ఆహ్వానం అందనున్న నేపథ్యంలో యడ్యూరప్ప ఇక్కడి తన నివాసంలో పార్టీ ముఖ్యులతో సమాలోచనలు జరిపారు. పార్టీలో చేరిన తర్వాత అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తాను బీజేపీలో ఎప్పుడు చేరేదీ నాలుగైదు రోజుల్లో ప్రకటిస్తానని తెలిపారు. బీజేపీలో విలీనంపై పార్టీలో తన నిర్ణయమే అంతిమమని ఆయన వెల్లడించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement