రాష్ట్ర ప్రభుత్వానికి ప్రహ్లాద్ జోషి సూచన
సాక్షి, బెంగళూరు : కేంద్ర ప్రభుత్వంతో ఘర్షణకు దిగడం సరికాదని, కేంద్రంతో సౌహార్దయుతమైన వాతావరణాన్ని నిర్మించుకుని రాష్ట్రాన్ని అభివృద్ధి పరిచే దిశగా ముందుకు సాగాలని రాష్ట్ర ప్రభుత్వానికి బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ప్రహ్లాద్ జోషి సూచించారు. కొంతమంది రాష్ట్రమంత్రులు కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధానమంత్రి నరేంద్రమోదీని ప్రతిరోజు విమర్శించడాన్నే పనిగా పెట్టుకున్నారని, ఇది సరైన పరిణామం కాదని అన్నారు. శుక్రవారమిక్కడి పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
లోక్‌సభ ఎన్నికల సమయంలో ప్రధాని నరేంద్రమోదీపై అత్యంత ఇబ్బందికర వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఇందుకు గాను ఎన్నికల కమిషన్ చీవాట్లు పెట్టినా... ఇప్పటికీ అదే మనస్థితిలో సిద్ధరామయ్య ఉండడం బాధాకరమని అన్నారు. గతంలో వాజ్‌పేయి ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో కర్ణాటక ముఖ్యమంత్రులుగా ఉన్న జె.హెచ్.పటేల్, ఎస్.ఎం.కృష్ణలు కేంద్రంతో సత్సంబంధాలను కొనసాగించారని, ఈ విషయాన్ని సిద్ధరామయ్య గ్రహించాల్సిన అవసరం ఉందని అన్నారు.
ఇక రాష్ట్రంలో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో అత్యవసర అసెంబ్లీ సమావేశాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇందుకు గాను తక్షణమే ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించి, నాయకుల అభిప్రాయాలను తీసుకొని తేదీని ఖరారు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న కరువు పరిహార చర్యలకు సంబంధించి ఈ సమావేశాల్లో ముఖ్యంగా చర్చించాలని సిద్ధరామయ్యను కోరారు.
కేంద్రంతో ఘర్షణ మంచిది కాదు
Published Sat, Sep 5 2015 3:56 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM
Advertisement
Advertisement