రాష్ర్ట బీజేపీ అధ్యక్షుడు {పహ్లాద్ జోషి
ప్రభుత్వ దివాళకోరుతనానికి ఇది నిదర్శనం
బెంగళూరు : రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి సతీష్ జారకీహోళి రాజీనామా పరిణామం ‘సిద్ధు’ సర్కారు పతనానికి నాంది అని బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు ప్రహ్లాద్ జోషి వాఖ్యానించారు. బుధవారమిక్కడి బీజేపీ ప్రధాన కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి జగదీష్ శెట్టర్, ఆ పార్టీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల ఇన్‌చార్జ్ మురళీధర్ రావుతో సమావేశం నిర్వహించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. సతీష్ జారకీహోళీ రాజీనామా చేయడం రాష్ట్ర ప్రభుత్వ దివాళాకోరు తనాన్ని బయటపెడుతోందని విమర్శించారు. సిద్ధరామయ్య ప్రభుత్వంలోని మరికొందరు మంత్రులు తమ పదవులకు రాజీనామా చేసే అవకాశాలున్నాయని తెలిపారు. ఇక అర్కావతి లే అవుట్‌లోని భూమి డీ-నోటిఫికేషన్ అంశానికి సంబంధించి ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై న్యాయపరమైన పోరాటం విషయంలో తమ పార్టీలో ఎలాంటి విబేధాలు లేవని స్పష్టం చేశారు.
సిద్ధరామయ్యపై ఫిర్యాదు చేయడాన్ని తమ పార్టీ ఎమ్మెల్యేలెవరూ వ్యతిరేకించలేదని తెలిపారు. ఇక జగదీష్ శెట్టర్, మురళీధర్‌రావులతో జరిపిన సమావేశంలో ఫిబ్రవరి 2 నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం పై ఏ విధంగా పోరాడాలి అనే అంశంపై చర్చించినట్లు ప్రహ్లాద్ జోషి వెల్లడించారు. ప్రభుత్వం పై పోరాటానికి ఎలాంటి విధానాలను అనుసరించాలి, అర్కావతి డీనోటిఫికేషన్ అంశానికి సంబంధించి సిద్ధరామయ్య పై న్యాయపోరాటానికి గవర్నర్ అనుమతి కోరడం, ఒకవేళ అనుమతి లభించక పోతే ఎలాంటి వ్యూహం అనుసరించాలి తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించినట్లు ప్రహ్లాద్‌జోషి తెలిపారు. అంతేకాక బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం మార్చితో ముగుస్తున్నందున ఈలోపు లక్ష్యాన్ని చేరేందుకు ఏ విధమైన ప్రణాళికలు రచించాలనే అంశంపై జగదీష్‌శెట్టర్, మురళీధర్‌రావుతో చర్చించినట్లు పేర్కొన్నారు.
సర్కారు పతనానికి నాంది
Published Thu, Jan 29 2015 2:23 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM
Advertisement