- కడవరకు నిజమే చెప్పాడు
- రవీంద్ర తల్లి సుశీల పాటిల్
సాక్షి, ముంబై: ‘మా కుటుంబం సంస్కారం నేర్పింది కాబట్టే నా కుమారుడు కడవరకు నిజమే చెప్పాడు. మాట మార్చలేదు. ప్రమాదం జరిగిన రోజు పోలీసు స్టేషన్‌లో అతడిచ్చిన సాక్షమే నేడు సల్మాన్‌ఖాన్‌కు శిక్ష పడేలా చేసింది.మృతి చెందిన, గాయపడిన వారికి న్యాయం జరిగింది’ అని దివంగత రవీంద్ర పాటిల్ తల్లి సుశీల పాటిల్ అన్నారు. తన కొడుకు చేసిన తప్పేంటని ప్రశ్నించారు. నిజం చెప్పడమే తన తప్పయితే మున్ముందు నిజం చెప్పడానికి ఎవరూ ముందుకు రారని అన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే తన కొడుకు రవీంద్ర స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసి అంగరక్షకుడిగా తన బాధ్యత నెరవేర్చాడని అన్నారు. అందుకు తమ కుటుంబం భారీ మూల్యం చెల్లించిందని, చేతికొచ్చిన కొడుకు పోయాడని, కుటుంబం విచ్ఛిన్నమైందని కంటతడి పెట్టింది. నిజం చెప్పడమే తన కొడుకు చేసిన తప్పా అని ప్రశ్నించింది. ఒకవేళ అదే నిజమైతే.. ఇక ముందు నిజం చెప్పడానికి ఎవరూ ముందుకు రారని చెప్పింది. సల్మాన్‌కు ప్రస్తుతం బెయిల్ దొరికినప్పటికీ తర్వాత జరిగే విచారణ త్వరగా పూర్తి చేయాలని కోరారు.
న్యాయమంటే ఉరి తీయడం కాదు
చట్ట ప్రకారం సల్మాన్ కేసును చూడాలని, భావావేశాల ప్రకారం కాదని దేశ అదనపు సోలిసిటర్ జనరల్ పింకీ ఆనంద్ అన్నారు. సల్మాన్ నటుడు అయినప్పటికీ చట్ట ప్రకారం విచారణ జరగాలని అన్నారు. గోవాలో జరుగుతున్న వుమెన్ ఎకనామిక్ ఫోరమ్‌లో ఆమె పాల్గొన్నారు. హిట్ అండ్ రన్ కేసులో సల్మాన్‌ను ముంబై కోర్టు దోషిగా తేల్చగా, బాంబే హైకోర్టు దాన్ని సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. దీనిపై పింకీ స్పందిస్తూ.. క్రిమినల్ నేరాలకు పాల్పడుతున్న ప్రతి ఒక్కరికీ చట్టం ఉరిశిక్ష విధించదని, సల్మాన్‌కు ఐదు సంవత్సరాల శిక్ష పడటం సబబే అని అన్నారు. సల్మాన్ కేసు తీర్పు వెలువడినప్పుడు కేసు ఎందుకు జాప్యం అయిందని, కేవలం ఐదేళ్ల శిక్ష సల్మాన్‌కు ఎలా విధిస్తారని పలువురు అడిగారని ఆమె అన్నారు. న్యాయం అంటే చేసిన నేరానికి ఉరితీయడం కాదని, నేరానికి తగ్గ శిక్ష విధించడం అని అన్నారు.
కాకా మానసిక ఒత్తిడికి గురయ్యాడు
రవీంద్ర పాటిల్ సోదరుడి కుమారుడు ప్రశాంత్, కుమార్తె మానసీ మాట్లాడుతూ.. సల్మాన్ కారు ప్రమాదం తరువాత కాకా (రవీంద్ర) మానసిక ఒత్తిడికి గురయ్యాడని చెప్పారు. అంతకు ముందు చలాకీగా ఉన్న కాకా ఒక్కసారి ఎందుకలా మారాడో అర్థం కాలేదన్నారు. ఒత్తిళ్లు భరించలేక విధులకు సరిగా హాజరుకాకపోవడం, విధుల నుంచి సస్పెండ్ చేసిన తరువాత అదృశ్యం కావడం జరిగిపోయాయన్నారు. హిట్ అండ్ రన్ కేసులో కాకా హాజర కావాలని కోర్టు ఆదేశించడంతో ఆ కేసులో ప్రధాన, ప్రత్యక్ష సాక్షి తనే అని తెలిసిందన్నారు. హిట్ అండ్ రన్ సంఘటన జరగకున్నట్లయితే నేడు కాకా తమ మధ్య ఉండేవాడని అన్నారు. రవీంద్ర పాటిల్ స్పోర్ట్స్ కోటాలో 1998లో పోలీసు శాఖలో చేరాడు. ప్రొటెక్షన్ యూనిట్‌లో విధులు నిర్వహించేవాడు. సల్మాన్‌ఖాన్‌కు అండర్ వరల్డ్ ముఠాల నుంచి బెదిరింపు ఫోన్లు రావడంతో రవీంద్రను అంగరక్షకుడిగా నియమించారు.
నా కొడుకు మాట మార్చలేదు
Published Sun, May 10 2015 11:36 PM | Last Updated on Tue, Aug 21 2018 5:46 PM
Advertisement
Advertisement