సాక్షి, ముంబై : బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఇంట్లో బాంబుందని పదహారేళ్ల బాలుడు పోలీసులకు నకిలీ ఈ మెయిల్ పంపాడు. ముంబైలోని బాంద్రా ఏరియాలో గల గెలాక్సీ అపార్ట్‌మెంట్‌లోని సల్మాన్‌ఖాన్ ఇంట్లో పెట్టిన బాంబు రెండు గంటల్లో పేలనుందని, ఆపే సత్తా ఉంటే ఆపుకోమని బాంద్రా పోలీస్ స్టేషన్‌కు ఈ నెల 4న ఈమెయిల్‌లో సవాల్ విసిరాడు. మెయిల్ చూసిన పోలీసులు హుటాహుటిన బాంబ్ స్క్వాడ్ సిబ్బందితో కలిసి సల్మాన్ ఇంటికి వెళ్లి చెక్ చేశారు. దాదాపు నాలుగుగంటల పాటు అణువణువూ గాలించారు. ఆ సమయంలో సల్మాన్ ఇంట్లో లేరు. ఇంట్లో ఉన్న సల్మాన్ తండ్రి సలీమ్‌ను, సోదరి అర్పితను పోలీసులు ముందే సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించిన పోలీసులు బాంబు దొరక్కపోవడంతో నకిలీ ఈ మెయిల్‌గా భావించి, మెయిల్ ఆధారంగా బాలుడిని ఘజియాబాద్ ప్రాంతవాసి(16)గా గుర్తించారు.
అనంతరం పోలీసుల బృందం నిందితుడి కోసం ఘజియాబాద్‌కు వెళ్లగా, భయపడిన బాలుడు స్థానిక టిస్ హజారీ కోర్టులో దాక్కున్నాడు. దీంతో న్యాయవాది అయిన బాలుడి సోదరుడిని కలిసిన బాంద్రా పోలీసులు అతని ద్వారా బాలుడిని ఒప్పించి ఇంటికి రప్పించారు. తర్వాత పోలీసుల ముందు హాజరు కావాల్సిందిగా కోర్టు ఇచ్చిన నోటీసును అతనికి చూపించి తమ వెంట తీసుకెళ్లి విచారించారు. విచారణలో అతను జనవరిలో ఘజియాబాద్‌లోని కబీర్‌నగర్ పోలీస్‌స్టేషన్‌కు ఇలాంటి బెదిరింపు మెయిల్ పంపినట్టు పోలీసులు గుర్తించారు. తర్వాత బాలుడిపై చార్జిషీట్ దాఖలు చేసి జువైనల్ కోర్టులో హాజరు పరిచారు. అనంతరం కోర్టు ఆదేశాల మేరకు అతడిని విడిచిపెట్టామని పోలీసులు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment