పాఠ్యాంశంగా యోగా
- గవర్నర్ వీఆర్ వాలా సూచన
సాక్షి, బెంగళూరు: సమాజంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యమయమైన జీవనాన్ని పొందేందుకు గాను చిన్నతనం నుంచే ‘యోగా’ను నేర్చుకోవాలని, ఇందుకోసం ఒకటో తరగతి నుంచే పాఠ్యాంశాల్లో ‘యోగా’ను తప్పనిసరి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని గవర్నర్ వజూభాయ్ రుడాభాయ్ వాలా సూచించారు. కర్ణాటక యోగా అకాడమీ ఆధ్వర్యంలో ఆదివారం రవీంద్రకళాక్షేత్రలో నిర్వహించిన ప్రముఖ యోగాగురు డాక్టర్ బీకేఎస్ అయ్యంగార్ సంస్మరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
చిన్నారులకు యోగాపై ఆసక్తిని పెంపొందించేందుకు గాను ఒకటో తరగతి నుంచి యోగా, ధ్యానానికి సంబంధించిన శిక్షణను పాఠ్యాంశంగా చేర్చాల్సిన అవసరం ఉందన్నారు. ఇలాంటి విధానాన్ని ఇదివరకే గుజరాత్‌లో అమల్లోకి తీసుకొచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఉదాత్త భావాలు, సరళమైన జీవనశైలి భారతీయ సంస్కృతిలో భాగమని, అయితే ఇప్పటి తరం ఎక్కువగా పాశ్యాత్య సంస్కృతి వైపు మొగ్గు చూపిస్తోందని అన్నారు.
ఏరోబిక్స్, జిమ్ తదితర వ్యాయామాలు శారీరక ధారుడ్యాన్ని మాత్రమే ఇస్తాయని, అయితే యోగా మాత్రం శారీరక ధారుడ్యంతో పాటు మానసిక ధారుడ్యాన్నీ పొందేందుకు సహకరిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో యోగా విశ్వవిద్యాలయం వైస్ చాన్స్‌లర్ డాక్టర్ హెచ్‌ఆర్ నాగేంద్ర, శ్వాసగురు వచనానందస్వామీజీ తదితరులు పాల్గొన్నారు.