'చంద్రబాబు బెదిరింపులకు భయపడం'
గుంటూరు: శాసనసభ హక్కుల కమిటీ నోటీసులపై మాచర్ల వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే పిన్నెళ్లి రామకృష్ణారెడ్డి స్పందించారు. ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా కోసం పోరాడితే ప్రభుత్వం నోటీసులిచ్చి బెదిరిస్తోందన్నారు. చంద్రబాబు బెదిరింపులకు భయపడేదిలేదన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం అరాచక పాలన సాగుతోందని విమర్శించారు. ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఎందాకైనా పోరాటం చేస్తామని ఆయన స్పష్టం చేశారు.
కాగా వైఎస్సార్‌సీపీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలకు ఆంధ్రప్రదేశ్ శాసనసభ హక్కుల కమిటీ నోటీసులు జారీ చేసింది. త్వరలో జరగనున్న కమిటీ సమావేశానికి హాజరై అభిప్రాయాలు వెల్లడించాలని ఆదేశించింది. 25 తేదీన ఆరుగురు, 26వ తేదీన మరో ఆరుగురు కమిటీ ముందు హాజరు కావాలని పేర్కొంది. ఈ మేరకు శాసనసభ ఇన్‌చార్జి కార్యదర్శి 12 ఎమ్మెల్యేలకు లేఖలు రాయడం గమనార్హం. సెప్టెంబర్ 8, 9, 10 తేదీల్లో రాష్ట్ర శాసనసభా సమావేశాల్లో తమ వాణి వినిపించేందుకు పట్టుపట్టిన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేల్లో 12 మందికి సభా హక్కుల కమిటీ నోటీసులు జారీ చేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.