ముంబై: అరబ్ పాలకులు ఇరాన్‌పై దాడులు చేయడంతో చాలా మంది పార్సీలు (జొరాస్ట్రియన్లు) భారత్‌కు వలస రావడం తెలిసిందే. అయితే వీరిలో వేలాది మంది ముంబైలో స్థిరపడ్డారు. విశేషమేమంటే ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో ఇప్పటికీ రెండు అగ్ని దేవాలయాలు (పార్సీలు అగ్నిని ఆరాధిస్తారు) ఉన్నాయని, దాదాపు 30 వేల మంది జొరాజిస్ట్రియన్ మతాన్ని పాటిస్తున్నారని మెహ్రాన్ సెపెరీ అనే పార్సీ మతస్తుడు తెలిపారు. వర్లిలోని ఎన్‌ఎస్‌సీఐ ఆడిటోరియంలో శుక్రవారం నుంచి మొదలైన ప్రపంచ జొరాస్ట్రియన్ మహాసభ సమావేశాల కోసం సెపెరీ టెహ్రాన్ నుంచి ముంబైకి వచ్చారు. టెహ్రాన్‌లోని యాద్ ప్రాంతంలోని పార్సీ ఆలయాన్ని వెయ్యేళ్ల క్రితం నిర్మించారని వెల్లడించారు. అయితే ముంబై పార్సీలతో పోలిస్తే ఇరాన్‌వాసుల సంస్కృతి, ఆచార వ్యవహారాల్లో చాలా తేడాలుంటాయని తెలిపారు. ‘మేం ఫార్సీ భాష మాట్లాడుతాం. ఆహారం కూడా వేరుగా ఉంటుంది. టిర్గాన్ వంటి ప్రత్యేక పండుగలూ జరుపుకుంటాం. వేసవిలో బహిరంగ ప్రదేశాల్లోకి చేరి ఒకరిపై ఒకరం నీళ్లు చల్లుకోవడం ద్వారా టిర్గాన్ సంబరాలు చేసుకుంటాం’ అని వివరించారు. మిగతా పండగలన్నీ అన్ని దేశాల్లో ఒకేలా ఉంటాయన్నారు. అయితే ఇరానీ పార్సీలు మతాంతర వివాహాలను పెద్దగా వ్యతిరేకించడం లేదు.
అమెరికాలో ఉంటున్న పార్సీలు ఈ విషయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇరాన్‌లోని ప్రపంచ జొరాస్ట్రియన్ చాంబర్ కామర్స్ సహ-వ్యవస్థాపకుడు పర్వీజ్ వజ్రవండ్ అమెరికన్‌ను పెళ్లాడారు. ఇరాన్‌లో ఎక్కడికి వెళ్లినా తన భార్యకు అంతా ఘనస్వాగతం పలుకుతారని ప్రస్తుతం ముంబైలోనే ఉన్న పర్వీజ్ అన్నారు. పార్సీ జాతిని సంరక్షించాలన్న వాదనను ఆయన తోసిపుచ్చారు. ‘మనమంతా ప్రవక్త జరతుస్త్ర సంతతి వాళ్లమా?’ అంటూ నవ్వేశారు. అయితే మతాంతర వివాహాల వల్ల జొరాస్ట్రియన్ మతం పూర్తిగా అంతరించిపోతుందని భయపడేవాళ్లు కూడా ఉన్నారు. మూడు తరాల తరువాత పార్సీ మతం అంతరించిపోయే అవకాశాలు ఉన్నాయని హూస్టర్ నగరవాసి, సరోష్ మానేక్‌షా ఆందోళన వ్యక్తం చేశారు. ఇరాన్ పార్సీ మహిళలకు సహపూజారులు (మోబెడ్‌యర్స్)గా పనిచేసేందుకు అనుమతి ఉంటుంది.
టెహ్రాన్‌లో మోబెడ్‌యర్‌గా పనిచేసే రషిన్ జెహంగిరి వర్లి మహాసభల్లో ప్రసంగించారు. ముంబై పార్సీల మాదిరిగా పాక్ పార్సీలు వేరే మతాల వారిని పెళ్లాడడానికి ఇష్టపడడం లేదు. ముంబై పార్సీ పూజారులు పార్సీ మహిళలు వేరే మతాల వారిని పెళ్లి చేసుకుంటే నవ్‌జోత్ (సంప్రదాయ పెళ్లి) నిర్వహించడానికి అంగీకరిస్తున్నారు. దేవాలయాల్లోకి కూడా రానివ్వడం లేదు. పార్సీ మతాన్ని కాపాడుకోవాలంటే మతాంతర వివాహాలను ప్రోత్సహించకూడదని కరాచీ నుంచి వచ్చిన 21 ఏళ్ల సోహ్రబ్ అన్నారు. ఇంగ్లండ్‌లో మాత్రం పార్సీలు మతాంతర వివాహాలు చేసుకోవడమే కాదు ఇతరులను కూడా తమ దేవాలయాల్లోకి అనుమతిస్తున్నారు. జొరాస్ట్రియన్ మహాసభ సమావేశాలు సోమవారంతో ముగుస్తున్నాయి.
పార్సీల రూటే సపరేటు
Published Mon, Dec 30 2013 5:35 AM | Last Updated on Sat, Sep 2 2017 2:07 AM
Advertisement
Advertisement