కృష్ణమ్మకు ప్రమిదలు వెలిగించి..జీవితంలో వెలుగులు నింపుకోవాలని అనుకున్నాడు.. ఆ యువకుడు. ఉన్నతంగా జీవించేలా దీవించాలని ఆ తల్లిని వేడుకునేందుకు తండ్రితోపాటే బయలుదేరాడు. విధిరాతకు ఎదురీదలేక చివరకు కృష్ణమ్మ ఒడిలోనే గల్లంతయ్యారు.ఆ తండ్రీకుమారుడు.
సూర్యాపేట క్రైం/వేములపల్లి : నూతనకల్ మండలం మిర్యాల గ్రామానికి చెందిన కేతం వెంకన్న. వృత్తిరీత్యా ఎల్‌ఐసీ ఏజెంట్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. మిర్యాల గ్రామమైనప్పటికీ ఏజెంట్‌గా పనిచేస్తూ సూర్యాపేట మొదటి విడత ఇందిరమ్మ కాలనీలోని ఓ ఇల్లును అద్దెకు తీసుకుని ఇక్కడే పాలసీలు చేయిస్తున్నాడు. తనకున్న ఇద్దరు కుమారులు జగదీశ్, నిశాంత్‌లకు విద్యాబుద్ధులు నేర్పిస్తున్నారు. అయితే పెద్ద కుమారుడు జగదీశ్ ఎంసీఏ పూర్తిచేసి హైదరా బాద్‌లో ఉద్యోగం సాధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు
తండ్రి వెళ్తున్నాడని..
జగదీశ్ రెండు నెలల నుంచి ఇంటి వద్దనే ఉంటున్నాడు. మంగళవారం తండ్రి వెంకన్న పాలసీలు చేయించేందుకు మిర్యాలగూడ బయలుదేరేందుకు సిద్ధమవుతున్నాడు. భక్తిభావం ఉన్న జగదీశ్ కృష్ణమ్మ ఒడిలో ప్రమిదలు వెలి గించాలని తండ్రికి చెప్పాడు. వెంటనే తండ్రివెంకన్న కొడుకు జగదీశ్‌నువెంట తీసుకుని మిర్యాలగూడకు బయలుదేరాడు. మార్గమధ్యలోని శెట్టిపాలెం గ్రామ శివారులోని సాగర్ ఎడమ కాలువ వద్దకు వెళ్లి ప్రమిదలు వెలిగించే ప్రయత్నంలో జగదీశ్ కాలు జారి పడిపోయాడు. వెంకన్న కుమారుడిని కాపాడబోయి ఆయన కూడా అందులో జారిపడ్డాడు. సాయంత్రం సమయంలో అక్కడే చేపలు పట్టే జాలరులు చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు.
వాహన నంబరుతో..
వెంకన్నకు ఉన్న టీవీఎస్ స్టార్ సిటీ వాహనం నంబర్ ద్వారా పోలీసులు అడ్రస్సు కనుగొని బంధువులకు సమాచారం ఇచ్చారు. వారు వెళ్లి చూసే సరికి చెప్పులు.. టూవీలర్ వాహనం వెంకన్నదిగా గుర్తించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుమేరకు అక్కడి పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు సాగిస్తున్నారు. అయితే వెంకన్న, జగదీశ్‌లు గల్లంతయ్యారా.. లేక ఇంకేమైనా జరిగి ఉందన్న కోణంలో పోలీసులు ముమ్మరంగా విచారణ సాగిస్తున్నారు.
పేటలో విషాధచాయలు..
సూర్యాపేట జిల్లా కేంద్రం ఇందిరమ్మ మొదటి విడత కాలనీతో పాటు వెంకన్న స్వగ్రామమైన మిర్యాలలో విషాదఛాయలు అలుముకున్నాయి. భర్త వెంకన్న, చేతికందిన పెద్ద కుమారుడు జగదీశ్ సాగర్ కాలువలో గల్లంతవడంతో భార్య రోది స్తున్న తీరు ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించింది.
Comments
Please login to add a commentAdd a comment