సాక్షి, చెన్నై: కుక్కపిల్ల, సబ్బుబిళ్ల కాదేది కవితకు అనర్హం అన్నారో మాహాకవి. అదే విధంగా రాజకీయాలకు కారెవరు అనర్హులు అని అనవచ్చు. ఎందుకంటే ఇక్కడ అర్హతలంటూ ఏమీ ఉండవు. ప్రజాదరణే ముఖ్యం. దాన్ని రాబట్టుకంటే రాజకీయాల్లో ఏమైనా కావచ్చు. అందుకే రాజకీయ పార్టీలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. ముఖ్యంగా తమిళనాడులో రోజుకో పార్టీ ఆవిర్భవిస్తోంది. సినీ ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్న కమలహాసన్ ధైర్యం చేసి రాజకీయ గోదాలోకి దూకేసినా, సూపర్‌స్టార్ రజనీకాంత్ లాంటి వారే రాజకీయ పార్టీ ఏర్పాటుకు ఇదుగో అదిగో ఊగిసలాడుతున్నారు. అలాంటిది నటి జూలి కొత్తగా రాజకీయ పార్టీకి సిద్ధం అవుతున్నట్లు ప్రచారం జోరందుకుంది.
బిగ్‌బాస్ రియాలిటీ షో ద్వారా వెలుగులోకి వచ్చిన ఈ అమ్మడు మెరీనా తీరంలో జల్లికట్టు పోరాటంలో గళమెత్తి మరింత ప్రాచుర్యం పొందింది. ప్రస్తుతం హీరోయిన్‌గా నటించేస్తున్న జూలీ అదే వేగంతో రాజకీయాల్లోకి దూకడానికి సన్నద్ధం అవుతోందట. తను కొత్తగా రాజకీయ పార్టీని ప్రారంభించనున్నట్లు ఒక వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేస్తోంది. వర్ధమాన నటి జూలీ నుంచి ఇలాంటి నిర్ణయాన్ని ఊహించని ఆమె అభిమానులు, సగటు ప్రేక్షకుడు షాక్ అవుతున్నారు. కొందరైతే తమిళనాడుకు ఇలాంటి గతి పట్టిందేమిటి అని తలపట్టుకుంటున్నారు. అయితే జూలి పేరుతో ప్రసారంలో ఉన్న ఆ వీడియోలో వాస్తవం ఎంత? అన్నది కూడా ఆలోచించాలి. ఏమో జూలీకి రాజకీయ మోహం కలిగి ఉండవచ్చు లేదా ప్రచారం కోసం చేసిన తంతూ కావచ్చు. మరి ఆ వీడియో గురించి నటి జూలీ ఎలా స్పందిస్తుందో చూద్దాం.
Comments
Please login to add a commentAdd a comment