ఈ రాష్ట్రానికి ఏమైంది...ఒకవైపు మావోలు..మరోవైపు ఐఎస్ తీవ్రవాదులు..విధ్వంసాలకు కుట్ర’. నాలుగు రోజుల్లో పట్టుబడిన నిందితుల నేపథ్యం ప్రభుత్వాన్ని ప్రజలను ఈ రకంగా భయాందోళనకు గురి చేస్తోంది.
సాక్షి ప్రతినిధి, చెన్నై: ఒకప్పుడు తమిళనాడు దేశంలోనే శాంతి భద్రతల సమస్యలు, తీవ్రవాద కార్యకలాపాలు లేని ప్రాంతంగా పేరుగాంచింది. ఆధ్యాత్మిక చింతన, గుళ్లు గోపురాలతో నిండిన రాష్ట్రంలో కరుడుగట్టిన వ్యక్తులకు తావులేదని భావించేవారు. అయితే కొన్నేళ్లలో ఈ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. తీవ్రవాద కార్యకలాపాలకు అవసరమైన మనుషులు తమిళనాడులో సులభంగా దొరుకుతారు అనే భావన జాతీయ, అంతర్జాతీయ తీవ్రవాదులు సైతం వేళ్లూనుకుపోయింది. యువతకు బ్రెయిన్ వాష్ చేసి ముఠాలో చేర్చుకోవడంలో కొందరు వ్యక్తులు నిమగ్నమై ఉండడం ఆందోళనకరమైన అంశం.
దశరథన్, సెన్బగవళ్లి అనే మావో దంపతులు తమ దళంలోకి యువతను చేర్చుకునే ప్రయత్నంలోనే ఈనెల 10వ తేదీన తిరువళ్లూరులో పట్టుబడడం గమనార్హం. సుమారు 15 ఏళ్ల క్రితం అప్పటి, ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని హతమార్చేందుకు తిరుమల అలిపిరి మార్గంలో మంతుపాతర పేల్చిన సంఘటనలో ఈ మావో దంపతులు నిందితులని పోలీసుల విచారణలో తేలింది. దీంతో సదరు మావోలు ఏపీపై గురిపెట్టినట్లు అనుమానిస్తున్నారు. మావో దంపతులతో పాటు రహస్య సమావేశానికి హాజరై పారిపోయిన పదిమంది మావోల కోసం తమిళనాడు–ఆంధ్రప్రదేశ్ సరిహద్దు అడవుల్లో క్యూ బ్రాంచ్ పోలీసులు ప్రస్తుతం గాలిస్తున్నారు.
ఐఎస్ కలకలం:
మావోల కోసం ఒకవైపు కూంబింగ్ జరగుతుండగా చెన్నైలో సోమవారం రాత్రి ఐఎస్ తీవ్రవాది దొరకడం, మరో ఐదుగురి కోసం గాలించడం గమనార్హం. సిరియా, ఇరాక్‌లోని కొంత ప్రాంతాన్ని తమ స్వాధీనంలోకి తెచ్చుకున్న ఐఎస్ తీవ్రవాదులు ప్రత్యేక దేశాన్ని ప్రకటించుకోవాలని పోరాడుతున్నారు. ఐఎస్ తీవ్రవాదులకు, ఇతర దేశాల సైనికులకు మధ్య హోరాహోరీగా పోరుసాగుతోంది. ఈ పోరు కోసం మరింత బలగాలను సిద్ధం చేసుకునేందుకు ఐఎస్ తీవ్రవాద సంస్థ ఇతర దేశాలపై కన్నువేసింది.
తమ తీవ్రవాద సంస్థకు ప్రపంచ నలుమూలలా సానుభూతిపరులు ఉన్నారని నమ్ముతున్న ఐఎస్ సంస్థ కేరళ నుంచి కొంత మంది యువకులను ఎంపిక చేసి సిరియాకు పంపి తమలో విలీనం చేసుకున్నట్లు కేంద్ర ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్‌ఐఏ) అధికారులు గ్రహించారు. దీనిపై ఎన్‌ఐఏ తీవ్రస్థాయిలో విచారణ చేపట్టగా తమిళనాడు నుంచి సైతం యువత తరలిపోతున్నట్లు తెలియడంతో సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. ఐఎస్ తీవ్రవాదం వైపు యువతను చేరవేయడంలో కడలూరు జిల్లాకు చెందిన ఖాజా ఫక్రుద్దీన్ ప్రధానపాత్ర పోషించినట్లు కనుగొన్నారు.
ఖాజా ఫక్రుద్దీన్ సిరియా దేశానికి వెళ్లి సాయుధ శిక్షణ కూడా తీసుకున్నాడు. సింగపూర్ పౌరసత్వాన్ని కలిగి ఉన్న ఖాజా ఫక్రుద్దీన్ కదలికలపై అధికారులు నిఘాపెట్టారు. గత ఏడాది జనవరిలో అతని ఢిల్లీకి వచ్చినçప్పుడు ఎన్‌ఏఐకి పట్టుబడగా, తమిళనాడులో తనకంటూ ఒక ప్రత్యేక తీవ్రవాద ముఠాను సిద్ధం చేసినట్లు, ఈ ముఠాలో 9 మంది తమిళులు ఉన్నట్లు అధికారుల వద్ద ఖాజా ఫక్రుద్దీన్ అంగీకరించాడు. ఈ 9 మందిపై 9 సెక్షన్లలో అనేక కేసులు పెట్టి గాలింపు ప్రారంభించారు. గత ఏడాది సెప్టెంబర్ 15వ తేదీన అబ్దుల్లా ముత్తలీఫ్, 18వ తేదీన సాహుల్ హమీద్ అనే ఐఎస్ సానుభూతిపరులు చెన్నైలో అరెస్టయ్యారు.
ఈ ముగ్గురిని ఎన్‌ఏఐ అధికారులు తీవ్రస్థాయిలో విచారించారు. మిగిలిన ఆరుగురు అజ్ఞాతంలో ఉంటూ ఐఎస్ కోసం నిధుల సమీకరణ చేస్తున్నట్లు తెలుసుకున్నారు. ఐఎస్ తీవ్రవాద సంస్థకు మానవరవాణా, నిధుల సమీకరణతోపాటూ తమిళనాడులో విధ్వంసాలకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లుగా పోలీసులు కనుగొన్నారు. ఏదో ఉపద్రవం జరిగేలోగా ఆరుగురిని పట్టుకోవాలని ఎన్‌ఏఐ అధికారులు గాలింపును తీవ్రతరం చేశారు. తమిళనాడులో ఐఎస్ తీవ్రవాదుల సంఖ్యలో కన్యాకుమారీ జిల్లా నాల్గవస్థానంలో ఉన్నట్లు అందిన సమాచారం ఎన్‌ఏఐ అధికారులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది.
కన్యాకుమారీ జిల్లా తిరువిదాంగేడు ఉత్తమన్ ప్రాంతానికి చెందిన అన్సార్ మీరన్ చెన్నైలో దాక్కుని ఉన్నట్లు అధికారులకు సమాచారం అందింది. ఢిల్లీ నుంచి వచ్చిన ఎన్‌ఏఐ అధికారులు సోమవారం రాత్రి అన్సార్‌మీరన్‌ను చెన్నైలో అరెస్ట్ చేశారు. అన్సార్ మీరన్ తనపై ఎవ్వరికీ అనుమానం రాకుండా ఉండేందుకు చెన్నైలో ట్రావెల్స్ ఏజెన్సీ నడుపుతూ ఐఎస్ కార్యకలాపాలు సాగిస్తున్నట్లు తేలింది. తన ట్రావెల్స్ ఏజెన్సీ ద్వారానే భారతదేశానికి చెందిన యువకులకు సిరియాకు విమాన టికెట్లు సమకూర్చాడు.
అన్సార్ మీరన్‌ను రహస్య ప్రదేశంలో ఉంచి ఎన్‌ఏఐ అధికారులు విచారిస్తున్నారు. తమిళనాడు నుంచి సిరియాకు ఎంతమంది యువకులను పంపారనే వివరాలను రాబట్టుతూ గాలింపును తీవ్రతరం చేశారు. అన్సార్ మీరన్‌ను పూందమల్లిలోని ప్రత్యేక కోర్టులో మంగళవారం హాజరుపరిచి పుళల్ సెంట్రల్ జైలుకు పంపారు. అన్సార్ మీరన్‌ను పదిరోజుల పోలీసు కస్టడీకి అప్పగించాల్సిందిగా కోరుతూ ఎన్‌ఏఐ అధికారులు మంగళవారం కోర్టులో పిటిషన్ వేశారు.
Comments
Please login to add a commentAdd a comment