ఎయిర్టెల్ వారి సెట్ టాప్ బాక్స్ వచ్చేసింది!
ఎయిర్టెల్ వారి సెట్ టాప్ బాక్స్ వచ్చేసింది!
Published Wed, Apr 12 2017 5:12 PM | Last Updated on Fri, Aug 17 2018 6:18 PM
సెటాప్ బాక్స్ లతో మరో సంచలనానికి తెరతీయాలని చూస్తున్న రిలయన్స్ జియో కంటే ముందస్తుగా టెలికాం దిగ్గజం ఎయిర్ టెల్ తన ఇంటర్నెట్ టీవీ సెట్ టాప్ బాక్స్ ను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఇంటర్నెట్ లో అందుబాటులో ఉండే అన్ని కంటెంట్లను చూసుకునేందుకు వీలుగా, 500 శాటిలైట్ టీవీ ఛానల్స్ పైగా అందించేలా సెట్ టాప్ బాక్స్ ను బుధవారం కంపెనీ ఆవిష్కరించింది. 4వేల యూట్యూబ్ కంటెంట్ ను ఇవి సపోర్టు చేస్తోంది. ఈ ఎయిర్ టెల్ సెట్ టాప్ బాక్స్ ఏ టీవీనైనా స్మార్ట్ టీవీగా మార్చే సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఆన్ లైన్, ఆఫ్ లైన్ నుంచి ఏ కంటెంట్ నైనా యూజర్లు తిలకించవచ్చు. గూగుల్ ప్లే స్టోర్ నుంచి యూజర్లు అప్లికేషన్లను, ప్లే గేమ్స్ టీవీపైకి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. దేశంలోఆండ్రాయిడ్ టీవీ ఆధారంగా లాంచ్ అయిన తొలి హైబ్రిడ్ డీటీహెచ్ సెట్ టాప్ బాక్స్ తమదేనని కంపెనీ చెబుతోంది.
ఈ కొత్త సెట్ టాప్ బాక్స్ లో నెట్ ఫ్లిక్స్ ప్రీలోడెడ్ గా ఉంటుంది. దీని ధర రూ.4999గా కంపెనీ పేర్కొంది. 4999తో మూడు నెలల డిజిటల్ టీవీ సబ్స్క్రిప్షన్ ను ఇది అందిస్తోంది. నేటి నుంచి అమెజాన్ ఇండియాలో ఇది ఎక్స్ క్లూజివ్ గా అందుబాటులో ఉంచుతున్నట్టు కంపెనీ తెలిపింది. ఆఫ్ లైన్ స్టోర్లలోనూ త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తామని ప్రకటించింది. ఏదైనా పనిమీద ఉన్నప్పుడు టీవీషోలను పాజ్ చేయడం, రికార్డు లేదా రివైండ్ చేయడం కూడా దీని ద్వారా చేసుకోవచ్చు. అయితే కంటెంట్ ను రికార్డు చేసుకోవడానికి యూజర్లు యూఎస్బీ పెన్ డ్రైవ్ ను ఇన్ సర్ట్ చేయాల్సి ఉంటుంది. డౌన్ లోడ్ యాప్స్ ను సేవ్ చేసుకోవడానికి ఎస్డీ కార్డును వాడుకోవచ్చు.
గేమ్ ప్యాడ్ యాప్ ద్వారా ఇంటర్నెట్ టీవీలోనే గేమ్స్ ను ఆడుకోవచ్చు. అదేవిధంగా స్మార్ట్ ఫోన్ ద్వారా కంట్రోల్ చేసుకునే వెసులుబాటును ఇది అందిస్తోంది. ఒకవేళ అవసరమైతే మొబైల్ హాట్ స్పాట్ ను లేదా హోమ్ లోని నెట్ వర్క్ ను కనెక్ట్ చేసుకోవచ్చు. 2గిగిహెడ్జ్ డ్యూయల్-కోర్ ప్రాసెసర్ తో రూపొందిన ఈ సెట్ టాప్ బాక్స్ 2జీబీ ర్యామ్ ను కలిగి ఉంది. యాప్స్ కోసం 8జీబీ ఇంటర్నెట్ స్టోరేజ్, ఎస్ డీ కార్డు ద్వారా 128జీబీ వరకు విస్తరణ మెమరీ, వై-ఫై రిసీవర్, బ్లూటూత్ ఫంక్షన్ దీనిలో మిగతా ఫీచర్లు. పట్టణ ప్రాంతాల్లో పెరుగుతున్న బ్రాడ్ బ్యాండ్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని, ముఖ్యంగా పట్టణ ప్రాంతాల ప్రజలకోసం దీన్ని తీసుకొచ్చినట్టు భారతీ ఎయిర్ టెల్ సీఈవో, డైరెక్టర్ సునిల్ తాల్దార్ చెప్పారు. వెబ్ లోని వరల్డ్ క్లాస్ కంటెంట్ ను టీవీపైకి తమ ఇంటర్నెట్ టీవీ తీసుకొస్తుందన్నారు.
Advertisement
Advertisement