ఎయిర్‌టెల్ 1000 జీబీ బోనస్ డేటా
బ్రాడ్‌బ్యాండు మార్కెట్‌లో అడుగుపెట్టి, అక్కడ కూడా సంచలనాలు సృష్టించాలని రిలయన్స్ జియో ప్లాన్స్ వేస్తుండగా... దానికి ముందుస్తుగా ఎయిర్‌టెల్ కూడా తన కస్టమర్లకు బంపర్ ఆఫర్లను ప్రకటిస్తోంది.. తాజాగా ఎయిర్‌టెల్ కొత్త బోనస్ డేటా ఆఫర్‌ను తన కస్టమర్లకు తీసుకొచ్చింది. ఈ కొత్త బోనస్ డేటా ఆఫర్ కింద కొత్త కస్టమర్లకు 1000జీబీ వరకు అదనపు డేటా అందించనున్నట్టు పేర్కొంది. ఎయిర్‌టెల్ ఆఫర్ చేస్తున్న చౌకైన ప్లాన్లు రూ.899 నుంచి ప్రారంభమవుతాయని, దీని కింద నెలకు 60 జీబీ డేటాను, అదనంగా ఏడాదిలో 500జీబీ డేటాను అందించనున్నట్టు కంపెనీ తెలిపింది. ఎయిర్‌టెల్ వెబ్‌సైట్ ప్రకారం ఈ ప్లాన్ స్పీడు 40 ఎంబీపీఎస్ వరకు అని తెలిసింది. మరో ప్లాన్ రూ.1099 కింద 40 ఎంబీపీఎస్ స్పీడులో నెలకు 100జీబీ డేటాను ఆఫర్ చేయనున్నామని, అంతేకాక 1000 జీబీ బోనస్ డేటాను వినియోగదారులకు అందించనున్నట్టు ప్రకటించింది.
ఇలా రూ.1299 ప్లాన్‌కు, రూ.1499, రూ.1799 ప్లాన్లకు 1000జీబీ వరకు బోనస్ డేటాను అందించనున్నట్టు ఎయిర్‌టెల్ తెలిపింది. కానీ ఇవన్నీ కొత్త కస్టమర్లకు మాత్రమేనని కంపెనీ వెల్లడించింది. ప్రస్తుతం రిలయన్స్ జియో కూడా తన ఫైబర్ నెట్‌వర్క్‌ను లాంచ్ చేయడానికి టెస్టింగ్ చేస్తోంది. కొన్ని ప్రాంతాల్లో వీటిని లాంచ్‌చేసింది కూడా. కానీ దేశవ్యాప్తంగా లాంచ్ చేయడానికి జియో ప్రయత్నాలు కొనసాగిస్తోంది. ఇప్పటికే టెలికాం మార్కెట్‌లోకి జియో ఎంట్రీతో తీవ్ర కుదుపులోకి లోనైనా టెలికాం దిగ్గజాలు, బ్రాడ్‌బ్యాండ్ మార్కెట్‌లో జియోకు కౌంటర్ ఇచ్చేందుకు ముందస్తుగానే సన్నద్ధమవుతున్నాయి.