కొత్త ఐఫోన్ల ధరలు భారత్‌లో ఎంతెక్కువ? | iPhone X, iPhone 8 Price in India Almost 40 Percent More Than the US Price | Sakshi
Sakshi News home page

కొత్త ఐఫోన్ల ధరలు భారత్‌లో ఎంతెక్కువ?

Published Sat, Sep 16 2017 4:15 PM | Last Updated on Thu, Apr 4 2019 5:12 PM

కొత్త ఐఫోన్ల ధరలు భారత్‌లో ఎంతెక్కువ? - Sakshi

కొత్త ఐఫోన్ల ధరలు భారత్‌లో ఎంతెక్కువ?

ఐఫోన్‌ 10వ వార్షికోత్సవ స్పెషల్‌ స్మార్ట్‌ఫోన్‌తో పాటు మరో రెండు ఐఫోన్లను ఆపిల్‌ అంతర్జాతీయ మార్కెట్‌లోకి తీసుకొచ్చేసింది. మరికొన్ని రోజుల్లో కొత్త ఐఫోన్‌ ఎక్స్‌, ఐఫోన్‌ 8, ఐఫోన్‌ 8 ప్లస్‌లు భారత మార్కెట్‌లోకి వచ్చేస్తున్నాయి. భారత్‌లో అత్యంత ఖరీదైన ఫోన్లలో తొలిసారి ఐఫోన్‌ ఎక్స్‌ సరికొత్త బెంచ్‌మార్కును సృష్టించబోతుంది. ఈ ఫోన్‌ 256జీబీ వేరియంట్‌ ధర లక్ష మార్కును దాటేయబోతుంది. ఈ ఫోన్‌కు ముందు భారత్‌లోకి వచ్చిన ఐఫోన్‌ 7ఎస్‌ ప్లస్‌ 256జీబీ వేరియంటే ఇప్పటివరకు అత్యధిక ధర ట్యాగ్‌ను కలిగి ఉంది. ప్రస్తుతం దాన్ని ఐఫోన్‌ ఎక్స్‌ దాటేస్తోంది.
 
అయితే అమెరికాతో పోలిస్తే, భారత్‌లో ఐఫోన్‌ ఎక్స్‌ ఖరీదు చాలా ఎక్కువని తెలిసింది. ఒక్క ఐఫోన్‌ ఎక్స్‌ మాత్రమే కాక, దాంతో పాటు వచ్చిన ఐఫోన్‌ 8, ఐఫోన్‌ 8 ప్లస్‌ ధరలు కూడా ఆపిల్‌ స్వదేశ మార్కెట్‌తో పోలిస్తే, భారత్‌లో చాలా ఎక్కువని వెల్లడైంది. అమెరికాలో పన్నులు కలుపకపోవడంతో, ధరలు తక్కువగా ఉంటున్నాయని, కానీ భారత్‌లో పన్నులు వేయడం వల్ల వీటి ధరలు పెరుగుతున్నాయని రిపోర్టులు పేర్కొన్నాయి. 
 
ఐఫోన్‌ ఎక్స్‌ ధర భారత్‌లో, అమెరికాలో...
ఐఫోన్‌ ఎక్స్‌ 64జీబీ వేరియంట్‌ ధర అమెరికాలో 999 డాలర్లు. భారత్‌లో దీని ధర 89వేల రూపాయలు. భారత్‌ ధరను అమెరికా డాలర్ల ప్రకారం లెక్కిస్తే 1,388 డాలర్లు. అంటే అక్కడ కంటే ఇక్కడ 39 శాతం ఎక్కువ. అదే 256జీబీ వేరియంట్‌ను తీసుకుంటే, భారత్‌లో దీని ధర రూ.1,02,000. అమెరికా 1,149 డాలర్లు. అంటే ఈ వేరియంట్‌ ధర కూడా 39 శాతం అధికం.
 
ఐఫోన్‌ 8, ఐఫోన్‌8 ప్లస్‌ ధరలు భారత్‌లో, అమెరికాలో...
ఐఫోన్‌ 8, 64జీబీ వేరియంట్‌ స్మార్ట్‌ఫోన్ ధర అమెరికాలో 699 డాలర్లు. భారత్‌లో 64వేలు. భారత్‌ ధరను అమెరికా డాలర్ల ప్రకారం లెక్కిస్తే 998 డాలర్లన్నమాట. అంటే అక్కడితో పోలిస్తే ఇక్కడ 43 శాతం అధికమని తెలిసింది. 
 
ఐఫోన్‌ 8, 256 జీబీ వేరియంట్‌ను తీసుకుంటే, ఈ స్మార్ట్‌ఫోన్‌ ధర అమెరికాలో 849 డాలర్లు, భారత్‌లో 77వేలుగా ఉంది. భారత్‌ ధరను అమెరికా డాలర్ల ప్రకారం లెక్కిస్తే 1200 డాలర్లు. అంటే ఈ ఫోన్‌కూడా 41 శాతం ఎక్కువని వెల్లడవుతోంది. 
 
ఆఖరికి ఐఫోన్‌ 8 ప్లస్‌ 64 జీబీ వేరియంట్‌ ధర అమెరికాలో 799 డాలర్లు. ఈ హ్యాండ్‌సెట్‌ భారత్‌లో రూ.73వేలుగా ఉండబోతుంది. దీన్ని కూడా అమెరికా డాలర్ల ప్రకారం లెకిస్తే 1,139 డాలర్లు. అంటే ఈ ఐఫోన్‌ కూడా అమెరికాతో పోలిస్తే భారత్‌లో 43 శాతం అత్యధికం. 
 
ఇక 256జీబీ వేరియంట్‌ను తీసుకుంటే, ఈ స్మార్ట్‌ఫోన్‌ ఖరీదు అమెరికాలో 949 డాలర్లు. భారత్‌లో 86వేలు. ఈ ధర కూడా అమెరికాతో పోలిస్తే, భారత్‌లో 41 శాతం అధికంగా ఉందని తెలిసింది. 
 
ఐఫోన్‌ 8 మోడల్స్‌ ప్రీ-ఆర్డర్లు సెప్టెంబర్‌ 22 నుంచి ప్రారంభమవుతున్నాయి. సెప్టెంబర్‌29న ఈ మోడల్స్‌ భారత్‌లో లాంచ్‌ కాబోతున్నాయి. ఇక అత్యంత ఖరీదైన ఐఫోన్‌ ఎక్స్‌ అక్టోబర్‌ 27 నుంచి ప్రీ-ఆర్డర్‌కు వచ్చి, నవంబర్‌ 8 నుంచి విక్రయానికి వస్తుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement