డేటా వార్: బెస్ట్ ప్లాన్ ఏది?
డేటా వార్: బెస్ట్ ప్లాన్ ఏది?
Published Sat, Apr 15 2017 9:24 AM | Last Updated on Tue, Sep 5 2017 8:51 AM
న్యూఢిల్లీ : రిలయన్స్ జియో, టెల్కోలతో గతేడాది సెప్టెంబర్ నుంచి కొనసాగిస్తున్న హోరాహోరీ పోరును ఇప్పట్లో ముగించేటట్టు లేదు. ఉచిత సర్వీసులతో చుక్కలు చూపెడుతోంది. ఓవైపు సమ్మర్ సర్ ప్రైజ్ ఆఫర్ కు ట్రాయ్ చెక్ పెట్టడంతో, ఆ ఆఫర్‌ను రీచార్జ్ చేసుకోలేకపోయిన ప్రైమ్ యూజర్లు, కొత్త కస్టమర్లే లక్ష్యంగా ధన్ ధనా ధన్ ఆఫర్ ను ప్రకటించింది. జియో ఈ ప్లాన్ ప్రకటించిన అనంతరం టెల్కోలు సైతం తమ కస్టమర్లను కాపాడుకోవడానికి హెవీ-డేటా ఆఫర్లను తీసుకొస్తున్నాయి. అయితే ప్రస్తుతం మార్కెట్లో ఉన్న బెస్ట్ ప్లాన్ ఏది? ఏ కంపెనీ ఎంత రీఛార్జ్ తో ఏ మేర డేటాను ఆఫర్ చేస్తోందో ఓ సారి తెలుసుకుందాం...
ఎయిర్ టెల్ రూ.244 ప్యాక్
ఈ కొత్త 244 రూపాయల ఆఫర్ కింద, ఎయిర్ టెల్ యూజర్లు రోజుకు 1జీబీ డేటాను 70 రోజుల పాటు వాడుకోవచ్చు. అయితే యూజర్లకు కచ్చితంగా 4జీ స్మార్ట్ ఫోన్, 4జీ సిమ్ కార్డు ఉండాల్సిందే. 1జీబీ డేటా ఎఫ్యూపీ మినహా డేటా వినియోగంపై కంపెనీ ఎలాంటి పరిమితులు విధించలేదు. ఆ ఆఫర్ కిందనే అపరిమిత ఎస్టీడీ, లోకల్ కాల్స్ ను ఆఫర్ చేస్తున్నట్టు కంపెనీ తన వెబ్ సైట్లో, మైఎయిర్ టెల్ యాప్ లో పేర్కొంది.. కానీ రోజుకు గరిష్టంగా 300 నిమిషాల ఉచిత ఎయిర్ టెల్ టూ ఎయిర్ టెల్ కాల్స్ మాత్రం చేసుకోవడానికి వీలుంటుంది. అదే ఇతర నెట్ వర్క్ కు అయితే వారంలో 1200 నిమిషాల ఉచిత కాల్స్ వస్తున్నాయి.
ఎయిర్ టెల్ రూ.399 ప్యాక్
ఈ ప్యాక్ కింద 4జీ స్మార్ట్ ఫోన్, 4జీ సిమ్ కార్డు ఉన్న యూజర్లు రోజుకు 1జీబీ డేటాను పొందవచ్చు. ఏ నెట్ వర్క్ కైనా ఉచితంగా కాల్స్ చేసుకోవచ్చు. కానీ ఆ పరిమితి 3000 నిమిషాలు మాత్రమే. అది కూడా 70 రోజులు మాత్రమే. ఉచిత నిమిషాలు అయిపోయిన తర్వాత నిమిషానికి 0.10 ఛార్జ్ ను కంపెనీ వసూలు చేస్తోంది. ఎయిర్ టెల్ నెంబర్లకు కాల్స్ చేసుకోవాలంటే రోజుకు 300 నిమిషాల పరిమితి, వారానికి 1200 నిమిషాల పరిమితిని కంపెనీ విధించింది. ఎలాంటి టెక్ట్స్ మెసేజ్ లను కంపెనీ ఆఫర్ చేయడం లేదు.
ఎయిర్ టెల్ కొత్త రూ.345 ప్యాక్
ఈ ప్లాన్ 28 రోజుల పాటు అందుబాటులో ఉంటుంది. 345 తో రీఛార్జ్ చేసుకున్న వారికి రోజుకు 2జీబీ 4జీ డేటాను కంపెనీ యూజర్లకు అందిస్తోంది. ఎయిర్ టెల్ టూ ఎయిర్ టెల్ కాల్స్ రోజుకు 300 నిమిషాలు, వారానికి 1200 నిమిషాలు. ఎలాంటి ఉచిత మెసేజ్ లకు అవకాశముండదు.
అయితే రూ.244, రూ.399 ప్లాన్స్ అందరికీ అందుబాటులో లేవట. ఆ ప్లాన్స్ కావాలంటే ముందస్తుగా మైఎయిర్ టెల్ యాప్ లేదా ఎయిర్ టెల్ వెబ్ సైట్లోకి లాగిన్ అయి, మీరు అర్హులో కాదో తెలుసుకోవాల్సి ఉంటుంది.
వొడాఫోన్ ఇండియా
రూ.352 ప్లాన్ ను వొడాఫోన్ ఇండియా అందుబాటులో ఉంచింది. ఈ ప్లాన్ కింద రోజుకు 1జీబీ 4జీ డేటాను కంపెనీ ఆఫర్ చేస్తోంది. రోజుకు 300 నిమిషాల లోకల్, ఎస్టీడీ కాల్స్ ను, వారానికి 1200 నిమిషాల కాల్స్ ను అందిస్తోంది. అయితే ఈ కంపెనీ కూడా ఎలాంటి ఉచిత మెసేజ్ లను అందించడం లేదు.
ఐడియా సెల్యులార్
ఐడియా సెల్యులార్ సైతం తన యూజర్ల కోసం రెండు రకాల ప్లాన్స్ ను అందుబాటులో ఉంచింది. ఒకటి రూ.297 ప్లాన్(70రోజులు), రెండు రూ.447 ప్లాన్(70రోజులు). ఈ రెండు ప్లాన్స్ కింద రోజుకు 1జీబీ 4జీ డేటాను అందిస్తోంది. అపరిమితి ఐడియా టూ ఐడియా కాల్స్(లోకల్ ప్లస్ ఎస్టీడీ). అదే ఇతర నెట్ వర్క్ లకైతే రూ.297 ప్లాన్ కింద రోజుకు 300 నిమిషాలను, వారానికి 1200 నిమిషాలను వాడుకోవచ్చు. అదే రూ.447 ప్లాన్ కిందైతే 3000 నిమిషాలను ఆఫర్ చేస్తోంది.
బీఎస్ఎన్ఎల్
బీఎస్ఎన్ఎల్ తన కొత్త యూజర్ల కోసం రూ.249 ప్లాన్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ప్లాన్ కింద నెలకు 300 జీబీ వరకు డేటాను అందించనున్నట్టు ప్రకటించింది. రాత్రి 9 నుంచి ఉదయం 7 వరకు అపరిమిత కాల్స్ ను ఆఫర్ చేస్తోంది. ఆదివారం రోజు మాత్రం రోజంతా ఈ ఉచిత కాల్స్ ఆఫర్ అందుబాటులో ఉంటుంది.
రిలయన్స్ జియో
జియో తన కస్టమర్లకు రూ.309 రీచార్జ్‌తో 84 రోజులకు 84 జీబీ డేటాను, రూ.509 రీచార్జ్‌తో 84 రోజులకు 168 జీబీ డేటాను ఆఫర్ చేస్తోంది. అంటే రోజుకు దాదాపుగా 1 జీబీ (రూ.309), 2 జీబీ (రూ.509) డేటాను పొందొచ్చు. దీనితోపాటు ఇక ఎస్‌ఎంఎస్, కాల్స్, జియో యాప్స్ సబ్‌స్క్రిప్షన్ మూడు నెలలపాటు ఉచితం. ఇక నాన్ ప్రైమ్ యూజర్లు, కొత్త కస్టమర్లు ఇవే ప్రయోజనాలను రూ.408, రూ.608 రీచార్జ్‌లతో పొందొచ్చు. ధన్ ధనా ధన్ ఆఫర్ కేవలం ఒక రీచార్జ్‌కు మాత్రమే పరిమితం.
Advertisement
Advertisement