![Have To Follow Rules - Sakshi](/styles/webp/s3/article_images/2018/11/12/kkkk.jpg.webp?itok=iqMOT5sp)
సాక్షి,ఖమ్మం: శాసనసభ ఎన్నికలకు నేటి నుంచి నామినేషన్ల దాఖలు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ నెల 12 నుంచి 19వ తేదీ వరకు అభ్యర్థులు నామినేషను దాఖలు చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. నామినేషన్లు దాఖలు చేసే సమయంలో సంబంధిత అభ్యర్థులు ఎన్నికల సంఘం నియమ నిబంధనలు పాటించకపోతే నామినేషన్లు తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉంది. నామినేషన్ల దాఖలుకు సంబంధించిన నియమావళి ఈ విధంగా ఉంది
- శాసనసభకు నామినేషన్ వేసేందుకు ఫారం–2బీ ఉచితంగా సంబంధిత రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో ఇస్తారు.
- ఒక్క అభ్యర్థి 4 నామినేషన్లు వేయవచ్చు.
- రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను సమర్పించేందుకు అభ్యర్థితో పాటు మరో నలుగురికి మాత్రమే కార్యాలయంలోనికి అనుమతిస్తారు.
- రెండు ఫొటోలు: ఒకటి స్టాంప్‌సైజ్ నామినేషన్ పేపరుపై, ఒకటి పాస్‌పోర్ట్‌సైజ్ ఫారం–26 (అఫిడవిట్)పై అంటించేందుకు.
- డిపాజిట్: రూ.10,000. షెడ్యూలు కులము, షెడ్యూలు తెగలకు సంబంధించిన వారికి రూ.5 వేలు. షెడ్యూలు కులము/తెగల వారు తప్పనిసరిగా కుల ధ్రువీకరణ పత్రం సమర్పించాలి.
- గుర్తింపు పొందిన జాతీయ/రాష్ట్ర రాజకీయ పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థి నామినేషన్‌ను అదే నియోజకవర్గములోని ఓటరుగా నమోదైన ఒక్కరే ప్రతిపాదించవచ్చును. (2బి లోని పార్ట్–1)
- పోటీ చేసేందుకు నామినేషన్ వేసే ఇతరులు అనగా రిజిష్టర్డ్ రాజకీయ పార్టీల వారు, స్వతంత్ర అభ్యర్థుల నామినేషన్లను అదే నియోజకవర్గంలోని (10) మంది ఓటర్లు ప్రతిపాదించాలి. (2బి లోని పార్ట్–2)
- ఇతరులు అనగా రిజిస్టర్/గుర్తింపు పొందని, స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్ పత్రంలోని (ఫారం–2బి పార్ట్–3 లోని (సి) కాలం ఎదురుగా కేటాయించాల్సిన గుర్తులను (ఈసీఐ పంపిన ఫ్రీ సింబల్స్ నుంచి) మూడింటిని ప్రాధాన్యతా క్రమంలో రాయాలి.
- పోటీ చేసే అభ్యర్థి పోటీ చేసే నియోజకవర్గం ఓటరు కాకపోతే.. అతడు ఓటరుగా నమోదైన నియోజకవర్గ ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ అధికారి నుంచి ఓటరు జాబితా సర్టిఫైడ్ ప్రతిని తీసుకువచ్చి నామినేషన్ వెంట సమర్పించాలి.
- ప్రతిపాదించే వారు నిరక్షరాస్యులు అయి నామినేషన్ పేపర్‌లో వేలిముద్ర వేస్తే తిరిగి రిటర్నింగ్ అధికారి ముందు వేలిముద్ర వేయవలసి ఉంటుంది.
- ఎన్నికల ఖర్చులకు సంబంధించి నామినేషన్ వేసే అభ్యర్థి నామినేషన్ వేసేందుకు (48) గంటల ముందు తన పేర కొత్త బ్యాంక్ అకౌంట్ ప్రత్యేకంగా తెరవాల్సి ఉంటుంది. ఇంతకు ముందు తెరిచిన బ్యాంక్ అకౌంట్‌లు అనుమతించబడవు.
- నామినేషన్ పత్రములోని ప్రతీ కాలమ్ తప్పనిసరిగా నింపాలి. ఆ కాలమ్‌లో నింపవలసినది లేనట్లైతే లేదు, వర్తించదు అని రాయాలి. అంతేకాని డ్యాష్ (–) వంటివి రాయకూడదు. ఏ కామ్ కూడా ఖాళీగా వదిలి వేయరాదు.
- గుర్తింపు పొందిన జాతీయ/రాష్ట్ర రాజకీయ పార్టీ నుంచి రిజిస్టర్డ్/గుర్తింపు పొందని రాజకీయ పార్టీలవారు ఫారం–ఎ, బి ఇంకుసైన్ చేయబడినది తేది:19–11–2018 మధ్యాహ్నం 3 గంటలోపు (నామినేషన్ వేసే చివరి రోజు) రిటర్నింగ్ అధికారికి సమర్పించాలి.
- నామినేషన్ పత్రంలో అభ్యర్థి తనపైగల క్రిమినల్ కేసు వివరములను పార్ట్–3ఎలో తప్పనిసరిగా పేర్కొనాలి.
- ఎన్‌పిడిసిఎల్ నుండి విద్యుత్‌కు సంబంధించి, మున్సిపాలిటి/గ్రామ పంచాయతీ నుండి నీటికి సంబంధించి, ప్రభుత్వము కేటాయించిన వసతి గృహము (క్వార్టర్)లో ఉన్నట్లైతే గత (10) సంవత్సరముల నుండి ఎలాంటి బకాయిలు లేనట్లు ధృవీకరణ పత్రములు సమర్పించాలి.
- నామినేషన్ వేసే సమయంలోనే రిటర్నింగ్ అధికారి ముందు భారత ఎన్నికల సంఘం నిర్దేశించిన ప్రతిజ్ఞ/శపథం (తెలుగు/ఆంగ్లం) చేయాల్సి ఉంటుంది. ఈ ప్రతిజ్ఞ తనకు నచ్చిన దేవుని పేరుమీదగాని, మనస్సాక్షి మీదగాని చేయవచ్చును.
- రిటర్నింగ్ అధికారికి అభ్యర్థి నమూనా సంతకం ఇవ్వాలి. (ఇది మీ తరపున ఎవరినైనా అనుమతించేందుకు ఉపకరిస్తుంది).
- అదే విధంగా తెలుగులో మీ పేరు బ్యాలెట్ పేపర్‌లో ఏ విధంగా ముద్రించవలెనో కూడా పేపర్ మీద రాసి ఇవ్వాలి.
ఈ దిగువ తెలిపిన ప్రతులు/ధ్రువీకరణలు
- రిటర్నింగ్ అధికారి నుంచి పొందాలి
- చెల్లించిన డిపాజిట్ మొత్తానికి రశీదు.
- స్క్రూటినీకి హాజరయ్యేందుకు నోటీసు.
- ఎన్నికల వ్యయాలను నమోదు చేసే రిజిస్టరు.
- కరపత్రాలు, పోస్టర్లు, ఫ్లెక్సీలు, తదితరాలు ముద్రించేందుకు ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 126–ఎ కింద సూచనలు.
- ప్రతిజ్ఞ/శపథం చేసినట్లు ధ్రువీకరణ పత్రం.
- నామినేషన్ పత్రాల్లోని లోపాలు/ఇంకనూ జతపరచాల్సిన పత్రాల సూచిక (చెక్ మెనూ)
Comments
Please login to add a commentAdd a comment