10 నెలలు లండన్‌లోనే..
- వీణావాణిల ఆపరేషన్‌కు షెడ్యూలిచ్చిన వైద్యులు
సాక్షి, హైదరాబాద్: అవిభక్త కవలలు వీణ, వాణీలను వేరు చేసేందుకు లండన్ వైద్య బృందం సంసిద్ధత వ్యక్తం చేసింది. తలలు అతుక్కుని పుట్టడంతో 12 ఏళ్లుగా నరకయాతన పడుతున్న ఆ చిన్నారులను పరీక్షించేందుకు బ్రిటన్‌లోని ప్రముఖ ‘గ్రేట్ ఆర్మండ్ స్ట్రీట్’ ఆసుపత్రి వైద్యులు డేవిడ్ డునావే, జిలానీ గత నెలలో హైదరాబాద్ వచ్చిన సంగతి తెలిసిందే. కవలలపై అన్ని రకాల పరీక్షలను నిర్వహించి ఆ నివేదికలను వారు పరిశీలించారు. ఈ ఫలితాల ఆధారంగా వీణ, వాణీలను వేరు చేయడం సాధ్యమేనని తేల్చారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి, నీలోఫర్ ఆస్పత్రికి ఇటీవలే నివేదిక పంపించారు. ఆపరేషన్‌కు సంసిద్ధత వ్యక్తంచేస్తూ.. దీనిపై నిర్ణయం తీసుకోవాల్సింది రాష్ర్ట ప్రభుత్వమేనని పేర్కొన్నారు.
పది నెలలు లండన్‌లోనే...
లండన్‌లోని తమ ఆసుపత్రిలో శస్త్రచికిత్స ద్వారా వీణ, వాణీలను వేరు చేయడానికి నిర్ణయించామని, ఇందుకు దాదాపు పది నుంచి 15 కోట్ల రూపాయల వరకు ఖర్చవుతుందని అక్కడి వైద్యులు తమ నివేదికలో పేర్కొన్నారు. అత్యంత క్లిష్టమైన శస్త్రచికిత్స అయినప్పటికీ తాము అందుకు సిద్ధంగా ఉన్నామని, ఐదారు దశల్లో శస్త్రచికిత్స నిర్వహిస్తామని, ఇందులో తమతో పాటు 20 మంది ప్రముఖ వైద్యులు పాలుపంచుకుంటారని వెల్లడించారు. కవలలకు సంబంధించిన వైద్య నివేదికలన్నీ క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే తుది నిర్ణయానికి వచ్చినట్టు లండన్ వైద్యులు తెలిపారు. పూర్తి చికిత్స కోసం వీణ-వాణీలు లండన్‌లో 300 రోజులు(దాదాపు 10 నెలలు) ఉండాల్సి ఉంటుందని నివేదికలో పేర్కొన్నారు.
శస్త్రచికిత్సకు ముందు(ప్రీ ఆపరేషన్) దశ కన్నా ఆపరేషన్ తర్వాతి(పోస్ట్ ఆపరేషన్) దశ అత్యంతక కీలకమైనదని వెల్లడించారు. మెదళ్లు కలిసి ఉన్న నేపథ్యంలో శస్త్రచికిత్స సంక్లిష్టంగా ఉంటుందని, ఈ కేసులో 75 నుంచి 80 శాతం సక్సెస్ రేటు ఉంటుందని, 20 నుంచి 25 శాతం రిస్క్ ఉంటుందని వివరించారు. ఈ నేపథ్యంలోనే శస్త్రచికిత్స అనంతరం నాలుగు నెలల పాటు లండన్‌లో ఉండాల్సి వస్తుందన్నారు. గతంలో ఇలాగే మెదళ్లు కలిసి పుట్టిన ఏడాది వయసున్న కవలల్ని విడదీశామని కూడా వెల్లడించారు.
ఈ నివేదిక నేపథ్యంలో ఇటు ఉన్నతాధికారులు, అటు నీలోఫర్ వైద్యులు ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న వెంటనే ఆపరేషన్ కోసం పిల్లలను లండన్ తీసుకెళ్లేందుకు వారి తల్లిదండ్రుల నుంచి నీలోఫర్ వైద్యులు లిఖితపూర్వక హామీ తీసుకోనున్నారు. సర్కారు నుంచి త్వరలోనే సానుకూల నిర్ణయం రానున్నట్లు తెలిసింది.