
సాక్షి, హైదరాబాద్: ఐటీ రంగంలో దూసుకుపోతున్న రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు మరిన్ని అంతర్జాతీయ సంస్థలు క్యూ కట్టాయి. కొత్తగా కార్యకలాపాలు ప్రారంభించేందుకు, దేశంలో ఇప్పటికే ఏర్పాటు చేసుకున్న సంస్థలను విస్తరించేందుకు మరో 10 కంపెనీలు భాగ్యనగర బాట పట్టాయి. ఈ జాబితాలో ఎక్కువగా ఐటీ/ఐటీ ఆధారిత సేవల కంపెనీలు ఉన్నాయి. అమెరికాకు చెందిన ష్యూర్, మైక్రాన్ టెక్నాలజీ, ఎఫ్5 నెట్‌వర్క్స్, మ్యాథ్‌వర్క్స్, క్లీన్ హార్బర్స్, కాండ్యూయెంట్, లెగాతో హెల్త్ టెక్నాలజీస్, త్రైవ్ డిజిటల్, బాంబార్డియర్ వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలో కార్యకలాపాలు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి.
అలాగే చైనాకు చెందిన థండర్ సాఫ్ట్‌వేర్ టెక్ సంస్థ గత సోమవారం లాంఛనంగా కార్యకలాపాలు ప్రారంభించింది. నగరంలో ఐటీ కంపెనీల కార్యకలాపాలు, విస్తరణకు అనుకూలంగా ఉండటం, సాంకేతిక నిపుణులు, మౌలిక వసతులు అందుబాటులో ఉండటంతోపాటు నూతన ఐటీ పాలసీ, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో రాష్ట్రం ఉత్తమ ర్యాంకు సాధించడం ఈ కంపెనీలు హైదరాబాద్‌పై ఆసక్తి చూపడానికి ప్రధాన కారణమని ఐటీరంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
పలు అభివృద్ధి చెందిన దేశాలకు చెందిన చిన్న కంపెనీలు సైతం ఇక్కడ కార్యకలాపాలు మొదలుపెట్టేందుకు ప్రభుత్వ వర్గాలను సంప్రదిస్తున్నాయని పేర్కొన్నాయి. ఆయా కంపెనీలు కార్యకలాపాలు సాగించేందుకు అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు ఐటీశాఖ అధికారులు తెలిపారు.
3 ఏళ్లలో మారిన సీన్...
భారత్‌లో సాఫ్ట్‌వేర్ కంపెనీలను నెలకొల్పాలనుకునే కంపెనీలు మూడేళ్ల క్రితం వరకు బెంగళూ రునే ఎంపిక చేసుకునేవి. ప్రస్తుతం మారిన పరిస్థితుల్లో హైదరాబాద్‌లో కంపెనీలు ఏర్పాటు చేసుకొని ఇక్కడి నుంచే కార్యకలాపాలు ప్రారంభించేందుకు ఆసక్తి చూపుతున్నట్లు ఐటీశాఖ వర్గాలు తెలిపాయి. గత మూడేళ్లుగా ఇదే ట్రెండ్ కొనసాగుతోందని పేర్కొన్నాయి. ప్రధానంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఐటీ, హార్డ్‌వేర్ పాలసీలు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో రాష్ట్రం ఉత్తమ ర్యాంకు సాధించడం వంటి అంశాలు పలు బహుళజాతి కంపెనీలు హైదరాబాద్‌ను తమ గమ్యస్థానంగా ఎంచుకోవడానికి కారణమని పేర్కొన్నాయి.
ఉపాధి, నిర్మాణ రంగానికి ఊతం...
ఒక్కో నూతన అంతర్జాతీయ కంపెనీ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 1,000 నుంచి 3,000 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించే అవకాశాలున్నట్లు ఐటీశాఖ అంచనా వేస్తోంది. అలాగే ఆయా కంపెనీలు తమ కార్యకలాపాలను ప్రారంభించేందుకు మాదాపూర్, గచ్చిబౌలి ప్రాంతాల్లో సుమారు 50 వేల నుంచి 3 లక్షల చదరపు అడుగుల మేర వాణిజ్య స్థలాలను లీజు ప్రాతిపదికన తీసుకోవడంతో నిర్మాణ రంగానికి సైతం ఊతమిచ్చినట్లు అయిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
గ్రేటర్ ఐటీ కంపెనీల్లో ఉపాధి ఇలా...
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం హైదరాబాద్‌లో సుమారు 100 చిన్న, పెద్ద ఐటీ కంపెనీలు ఏర్పాటయ్యాయి. ఆయా కంపెనీల్లో కొత్తగా 50 వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభించినట్లు ఐటీశాఖ వర్గాలు తెలిపాయి. టీఎస్ ఐపాస్ రాకతో గత రెండేళ్లుగా బుద్వేల్ తదితర ప్రాంతాల్లో ఐటీ కంపెనీల ఏర్పాటుకు సుమారు 30 కంపెనీలు దరఖాస్తు చేసుకున్నాయన్నారు. భాగ్యనగరంలో ఇప్పటికే సుమారు 647 బహుళజాతి, దేశీయ దిగ్గజ సంస్థలకు చెందిన ఐటీ కంపెనీలు కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ఆయా కంపెనీల్లో సుమారు 5 లక్షల మంది ఉపాధి పొందుతున్నారు.
భాగ్యనగర బాటపట్టిన కంపెనీలివే..
1. ష్యూర్
2. మైక్రాన్ టెక్నాలజీ
3. ఎఫ్5 నెట్‌వర్క్స్
4. మ్యాథ్‌వర్క్స్
5. క్లీన్ హార్బర్స్
6. కాండ్యూయెంట్
7. లెగాతో హెల్త్ టెక్నాలజీస్
8. త్రైవ్ డిజిటల్
9. బాంబార్డియర్
10. థండర్ సాఫ్ట్‌వేర్ టెక్
Comments
Please login to add a commentAdd a comment