సాక్షి, హైదరాబాద్: ముత్యాల నగరం (సిటీ ఆఫ్ పెరల్స్) ఐటీ బాట పట్టింది. మహానగరంలో గత ఏడేళ్లుగా ఐటీ, అనుంబంధ రంగ కార్యకలాపాలు అనూహ్యంగా పెరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా నగరం నలుచెరుగులా ఐటీ రంగాన్ని విస్తరించేందుకు కంకణం కట్టుకోవడంతో వందలాదిగా నూతన కంపెనీలు..వేలాది కొలువులు సిటీజన్లకు వరంగా మారాయి. తాజాగా కండ్లకోయలో 6 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించనున్న ఐటీ పార్క్‌తోపాటు.. ఇటీవలే జెన్‌పాక్ సంస్థ తమ గ్రిడ్ పాలసీలో భాగంగా ఉప్పల్‌లోని తమ క్యాంపస్‌ను 20 లక్షల చదరపు అడుగుల వాణిజ్య కార్యాలయాన్ని విస్తరించిన విషయం విదితమే. ఈ సంస్థ రాకతో కేవలం ఉప్పల్ ప్రాంతంలోనే ఏకంగా 15 వేలకుపైగా కొత్త ఉద్యోగాలు రానుండడం విశేషం. నగర ఐటీ సెక్టార్‌లో ప్రస్తుతం ఉన్న 6 లక్షల కొలువులకు అదనంగా రాబోయే రోజుల్లో మరో లక్ష ఉద్యోగాల కల్పన సాధ్యపడుతుందని ఆశాఖ వర్గాలు ఆశాభావం వ్యక్తంచేస్తున్నాయి.
వేగంగా విస్తరణ..
► నార్త్ హైదరాబాద్ కింద పరిగణించే కండ్లకోయ పరిధిలో 35 ఇంజినీరింగ్, 50 ట్రెడిషనల్ డిగ్రీ కాలేజీలు 30 ఎంబీఏ కాలేజీలతో పాటు పలు ఫార్మసీ, మెడికల్, నర్సింగ్ కాలేజీలు ఉన్నాయి.
► ప్రతి ఏడాది 15 నుంచి 20 వేల మంది ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లు బయటకు వస్తున్నారు.
► వెస్ట్ హైదరాబాద్‌కు వెళ్లి ఐటీ ఉద్యోగాలు చేయడం కంటే.. నార్త్ హైదరాబాద్‌లోనే ఐటీ ఉద్యోగాలు చేసేలా నగరానికి నలువైపులా ఐటీ పార్కులు నిర్మించేందుకు నూతన ఐటీ పాలసీ దోహదం చేస్తుందని ఐటీ రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
► నార్త్‌సిటీ పరిధిలో మంచి యూనివర్సిటీలు, సమీపంలోనే ఎంఎంటీఎస్, జాతీయ రహదారులు,అర్భన్‌పార్క్‌లు ఉండడం ఈప్రాంతంలో ఐటీ విస్తరణ వేగం పుంజుకుంది.
అగ్రశ్రేణి కంపెనీలకు కేరాఫ్..
► ప్రపంచంలోనే టాప్ 5 కంపెనీలతో పాటు అనేక కంపెనీలు హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టాయి. యాపిల్, గూగుల్, అమెజాన్, ఫేస్‌బుక్, మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీలు తమ కార్యకలాపాలను ప్రారంభించిన విషయం విదితమే.
► అమెజాన్ కంపెనీ ప్రపంచంలోనే అతిపెద్ద క్యాంపస్‌ను హైదరాబాద్‌లో నెలకొల్పింది. 31 లక్షల చదరపు అడుగుల్లో దీన్ని ఏర్పాటు చేసింది. ప్రస్తుతం గ్రేటర్ పరిధిలో సుమారు 1500 వరకు ఉన్న చిన్న, పెద్ద, కార్పొరేట్ కంపెనీల్లో సుమారు 6.28 లక్షల మంది ఉపాధి పొందుతున్న విషయం విదితమే.
హై..హై..ఐటీ..
గ్రేటర్ పరిధిలో 2014 నుంచి ఐటీ భూమ్ క్రమంగా పెరుగుతోంది. విశ్వవ్యాప్తంగా పేరొందిన దిగ్గజ ఐటీ, బీపీఓ, హార్డ్‌వేర్, కేపీఓ సంస్థలు నగరానికి క్యూ కడుతున్నాయి. కరోనా కష్టకాలంలోనూ నగరంలో ఐటీ కంపెనీల కార్యకలాపాలు, నూతన కంపెనీల వెల్లువ తగ్గకపోవడం విశేషం. ప్రస్తుతం ఏటా రూ.1.45 లక్షల కోట్లుగా ఉన్న ఐటీ ఎగుమతులు 2026 నాటికి ఏటా రూ.3 లక్షల కోట్ల మార్కును దాటుతాయని ఐటీ వర్గాలు లెక్కలు వేస్తుండడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment