సాక్షి, సిటీబ్యూరో : దేశవ్యాప్తంగా వివిధ రంగాల్లో కొలువుల వృద్ధి శాతం 3 శాతం పెరగ్గా...ఐటీ రంగంలో మాత్రం 12 శాతం కొలువులకు కోత పడినట్లు తాజా సర్వేలో తేలింది. 2017, ఏప్రిల్‌తో పోలిస్తే 2018 ఏప్రిల్ చివరి నాటికి పలురంగాల్లో కొలువులకు కోత పడగా.. మరికొన్ని రంగాల్లో వృద్ధి నమోదైనట్లు నౌక్రి డాట్‌కామ్ వెబ్‌సైట్ తాజా అధ్యయనంలో వెల్లడైంది.
ఐటీ..అనుబంధ రంగాల్లో ఇలా..
2018, ఏప్రిల్ నెలాఖరునాటికి వివిధ రంగాల్లో కొలువుల వృద్ధిరేటును పరిశీలించి విడుదల చేసిన తాజా జాబ్‌సీక్ రిపోర్ట్‌లో ఐటీ మినహా ఇతర రంగాల్లో వృద్ధి మూడు శాతం నమోదైందని ఈ అధ్యయనం తేటతెల్లం చేసింది. ప్రధానంగా ఆటోమోబైల్, నిర్మాణ రంగం, ఇంజినీరింగ్ విభాగాల్లో కొలువుల జోరు కొనసాగుతోందని ఈ రిపోర్ట్ వెల్లడించడం విశేషం.
మెట్రో నగరాల్లో జాబ్ ట్రెండ్స్ ఇలా..
ముంబయి, కోల్‌కతా నగరాల్లో ప్రతీఏటా ఐటీ కొలువుల్లో వృద్ధి నమోదవుతోందని..కానీ బెంగళూరు, హైదరాబాద్ నగరాల్లో నాలుగుశాతం తగ్గినట్లు ఈ నివేదిక వెల్లడించింది. కాగా కోల్‌కతాలో ఏటా ఐదుశాతం వృద్ధి, ముంబయిలో 4 శాతం, చెన్నైలో ఒకశాతం వృద్ధి నమోదవుతోందట. ఇక పుణే నగరంలోనూ కొలువుల్లో ఒక శాతం కోత పడుతున్నట్లు ఈ సర్వే రిపోర్టు వెల్లడించింది.
పురోగమిస్తోన్న కొత్త రంగాలు..
ఐటీ రంగంలో కొలువుల వృద్ధిరేటు తగ్గుముఖం పట్టగా...మరోవైపు ఆటోమొబైల్, పారిశ్రామికరంగం, నిర్మాణ రంగాల్లో కొలువుల వృద్ధి గణనీయంగా నమోదవడం విశేషం. ఇక బీపీఓ, ఇన్సూరెన్స్, బ్యాంకింగ్, ఫార్మా, బయోటెక్ రంగాల్లోనూ స్వల్పవృద్ధి రేటు నమోదైనట్లు తాజా నివేదికలో వెల్లడైంది.
మెట్రో నగరాల్లో ఐటీ కొలువుల్లో పెరుగుదల/తరుగుదల ఇలా ఉంది...
నగరం పెరుగుదల/తరుగుదల
కోల్‌కతా 5 శాతం వృద్ధి
ముంబయి 4 శాతం వృద్ధి
చెన్నై 1 శాతం వృద్ధి
బెంగళూరు 4 శాతం తరుగుదల
హైదరాబాద్ 4 శాతం తరుగుదల
వివిధ రంగాల్లో వృద్ధి ఇలా ఉంది.
రంగం కొలువుల్లో వృద్ధి ఇలా ఉంది (శాతంలో)
ఆటోమొబైల్ 33
పారిశ్రామికరంగం 23
నిర్మాణరంగం 20
బీపీఓ 11
ఇన్సూరెన్స్ 06
బ్యాంకింగ్ 05
ఫార్మా, బయోటెక్ 04
మందగమనం తాత్కాలికమే
నగరంలో ఐటీ రంగంలో కొలువుల వృద్ధిరేటు తాత్కాలికంగా తగ్గుముఖం పట్టినప్పటికీ..త్వరలో కొత్త కంపెనీలు, ప్రాజెక్టుల రాకతో పుంజుకుంటున్నట్లు అంచనా వేస్తున్నాం. ఐటీ, హార్డ్‌వేర్ పాలసీ, టీఎస్‌ఐపాస్ రాకతో గ్రేటర్ నగరానికి దేశ, విదేశీ దిగ్గజ కంపెనీల రాక మొదలైంది.
– జీఎల్.స్వామి, ఐటీ రంగ నిపుణుడు
Comments
Please login to add a commentAdd a comment