ఆపదలో 108 | 108 of endangered | Sakshi
Sakshi News home page

ఆపదలో 108

Published Sun, Sep 28 2014 3:46 AM | Last Updated on Fri, Sep 28 2018 3:18 PM

ఆపదలో 108 - Sakshi

ఆపదలో 108

ఆదిలాబాద్ రిమ్స్ : కుయ్.. కుయ్.. కుయ్ అంటూ రోగులను అత్యవసర సమయంలో ఆస్పత్రికి తీసుకెళ్లి ప్రాణాలు కాపాడే అపర సంజీవనికి ఆపద వచ్చింది. జిల్లాలో 108 సేవలకు గ్రహణం పట్టింది. తరచూ ఇంధన కొరత.. వాహనాలు రిపేర్‌కు రావడం.. వెరసి ప్రజలకు సేవలందించలేకపోతున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో 108 రాక.. ప్రజలు ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా రోజు వారీగా వందల సంఖ్యలో ప్రాణాలు కాపాడుతున్న ఈ వాహనాల రాకపోకలు నిలిచిపోతుండడంతో ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తోంది.
 
ఇంధనం కొరత..
జిల్లాలో 2006 ఆగస్టులో ఆదిలాబాద్, మంచిర్యాలలో ఒక్కో వాహనంతో 108 సేవలు ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత సంవత్సర కాలంలో విడుతల వారీగా 30 వాహనాలు అందుబాటులోకి వచ్చాయి. కాగా.. వీటిలో డీజిల్ ఇంధనం లేకపోవడంతో తరచూ సేవలు నిలిచిపోతున్నాయి. పది రోజులుగా డీజిల్ కొరతతో దాదాపు 20కి పైగా వాహనాల సేవలు ఆగిపోయాయి. శనివారం జిల్లా కేంద్రంలో సైతం డిజిల్ లేదని నాలుగు వాహనాలను సిబ్బంది నిలిపివేశారు. దీంతో 108 సేవల కోసం ఫోన్‌చేసే వారికి డీజిల్ లేదని.. వాహనం నడవడం లేదని సమాధానం చెప్తున్నారు. ఇలా ప్రతి రోజూ ఒక్కో వాహనానికి 20 నుంచి 30 ఫోన్‌కాల్స్ వస్తుంటాయి. ఎంతో అత్యవసర సమయం అయితే కానీ 108కు ఫోన్ చేయరు.

అలాంటిది ఫోన్ చేసినా వాహనం రాకపోవడంతో పలువురు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించి రోగులను ఆస్పత్రికి తీసుకెళ్తున్నారు. పెట్రోల్ బంకుల్లో డీజిల్‌ను అరువుగా పోయించుకుంటున్నా వాటి బకాయిలు పెరిగిపోయింది. దీంతో బంక్ యజమానులు ఇంధనం పోయడం నిలిపివేశారు. కొన్నిచోట్ల మాత్రం ఇంకా అరువుగా ఇంధనం పోయించుకుంటున్నారు. ప్రస్తుతం ఒక్కో వాహనానికి నెలకు రూ.20 వేల చొప్పున ఇంధన బకాయిలు ఉన్నట్లు తెలుస్తోంది. మూడు నెలలుగా ఈ బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. ఫలితంగా ఆదిలాబాద్, జైనథ్, తాంసి, ఇంద్రవెల్లి, ఇచ్చోడ, బోథ్, నేరడిగొండ, నార్నూర్, జైనూర్‌తోపాటు చాలా ప్రాంతాలకు ఇప్పటికే వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.
 
మరమ్మతుకు నోచుకోని వాహనాలు..
తొమ్మిది సంవత్సరాలుగా అవే వాహనాలు నడిపిస్తుండడంతో అవి కండీషన్ కోల్పోయి మూలనపడుతున్నాయి. ఇప్పటి వరకు ఒక్కో వాహనం సుమారు 3 లక్షల నుంచి 5 లక్షల కిలోమీటర్ల వరకు తిరిగాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 3 లక్షల కిలోమీటర్ల వరకు తిరిగిన వాహనాలను తొలగించి వాటి స్థానంలో కొత్తవి అందించాలి. కానీ.. ఇప్పటి కీ కొత్తవి మంజూరు లేక అవే వాహనాలను వినియోగిస్తున్నారు. దీంతో వాహనాలు తప్పుపట్టి తరచూ ఏదో ఒక సమస్యతో గ్యారేజీకి తరలుతున్నాయి. వాటికి మరమ్మతులు చేసేందుకు పెద్ద మొత్తంలో డబ్బులు చెల్లించాల్సి వస్తోంది. అయితే జిల్లాలో వాహనాల మరమ్మతుల కోసం చేసిన బిల్లులు కూడా 6 నెలలుగా పెండింగ్‌లోనే ఉన్నాయి. 15 మంది మెకానిక్‌లకు రూ.50 వేల నుంచి రూ.60 వేల వరకు బకాయి ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో వాహనాలు మెకానిక్ షెడ్‌కు వెళ్లినప్పుడు బిల్లులు ఇవ్వలేడం లేదంటూ.. ఆ వాహనాలను రోజుల తరబడి షెడ్డులోనే పెట్టుకుంటున్నారు.
 
వాహనాల్లో పరికరాల కొరత..
108 వాహనాల్లో పరికరాల కొరత తీవ్రంగా ఉంది. తొమ్మిదేళ్లుగా అవే పరికరాలు వాడుతుండడంతో సరిగా పనిచేయడం లేదు. కొన్ని పరికరాలు పూర్తిగా చెడిపోయాయి. రోగులకు ప్రథమ చికిత్సకు చేయాల్సిన పరికరాలు సైతం అందుబాటులో లేక వాహనాల్లో రోగులను తీసుకొచ్చే సమయంలో ఇబ్బందులు పడాల్సి వస్తోందని సిబ్బంది పేర్కొంటున్నారు. ప్రస్తుతం కొన్ని వాహనాల్లో బీపీ ఆపరేటర్స్, పల్స్‌మిషన్, స్టెతస్కోప్, తర్మామీటర్, మానిటర్, వెంటిలేటర్, నెఫ్లేజర్, గ్లూకోమీటర్లు కూడా లేని దుస్థితి నెలకొంది. తుప్పుపట్టి వాహనాల్లో పరికరాలు లేకుండానే బాధితులను తరలిస్తున్నామని సిబ్బంది పేర్కొనడం గమనార్హం.

ఇందులో పనిచేసే 180 మంది సిబ్బందికి కూడా రెండు నెలలుగా వేతనాలు చెల్లించడం లేదు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి సేవల నిర్వహణకు నయాపైసా విడుదల కాలేదు. ఇటు ఇంధన, పరికరాల కొరత, అటు మరమ్మతు సమస్య వేధిస్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నిధులు విడుదల చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
 
చర్యలు చేపడుతాం..
 - శాంతిసాగర్, 108 జిల్లా కోఆర్డినేటర్

 108 వాహనాల్లో డిజిల్ కొరత లేకుండా చర్యలు చేపడుతున్నాం. మూడు నెలల నుంచి బిల్లులు అందకపోవడంతోనే ఈ పరిస్థితి నెలకొంది. ఇటీవల ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి సైతం తీసుకెళ్లాం. త్వరలోనే పూర్తిస్థాయిలో బిల్లులు చెల్లించి వాహనాలు నిలిచిపోకుండా చూస్తాం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement