
‘108’ సమ్మెకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు
క్యాబ్ డ్రైవర్లతో
నడిపేందుకు యోచన
నేడు, రేపు ఉద్యోగులు, జీవీకేతో ప్రభుత్వం చర్చలు
హైదరాబాద్: ‘108’లో సమ్మె సైరన్ మోగింది. ఈ నెల ఏడో తేదీ అర్ధరాత్రి నుంచి సమ్మెకు వెళ్తామని ‘108’ ఉద్యోగుల సంక్షేమ సంఘం సోమవారం ప్రకటించింది. దీంతో ‘108’ అత్యవసర సేవలకు విఘాతం కలగనుంది. మరోపక్క సమ్మెను నివారించేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. అందుకోసం మంగళ, బుధవారాల్లో ఉద్యోగులు, జీవీకే-ఈఎంఆర్‌ఐ సంస్థతో చర్చలు జరపాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈసారి కార్మికశాఖను కూడా రంగంలోకి దింపాలని భావిస్తోంది. ఇదిలావుండగా తప్పనిసరి పరిస్థితుల్లో సమ్మె జరిగితే ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై జీవీకే సంస్థ దృష్టిసారించింది. కొత్తగా కొనుగోలు చేయనున్న 169 వాహనాలకు అవసరమైన సిబ్బందిని ఇప్పటికే నియమించుకున్న నేపథ్యంలో వారిని ఇప్పుడు ఉపయోగించుకోవాలని భావిస్తున్నట్లు తెలిసింది. మరోవైపు ప్రైవేటు క్యాబ్ డ్రైవర్లను ఉపయోగించుకోవాలని యోచిస్తున్నట్లు సమాచారం.
15 డిమాండ్లు..
గత నెల 15 డిమాండ్లతో సమ్మె నోటీసు ఇచ్చిన ఉద్యోగులతో జీవీకే సంస్థ జరిపిన చర్చలు విఫలం కావడంవల్ల అనివార్యంగా సమ్మెకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని సంఘం నేతలు అంటున్నారు. కాగా, సమ్మెను విజయవంతం చేస్తామని ఉద్యోగుల ప్రతినిధి అశోక్ పేర్కొన్నారు.