11,45,611
- సర్వేలో వివరాలు అందజేసిన కుటుంబాల సంఖ్య
- 34,465 ఇళ్లకు తాళం.. వరంగల్ నగరంలో అసంపూర్తి
- నమోదుకాని కుటుంబాలు 11వేలు
- బుధవారం జరగని సర్వే.. ప్రభుత్వ ఆదేశాలతో నిలిపివేత
సాక్షిప్రతినిధి, వరంగల్ : సమగ్ర కుటుంబ సర్వేలో భాగంగా జిల్లాలో 11,45,611 కుటుంబాల వివరాలను నమో దు చేశారు. ముందుగా అంచనా వేసిన ప్రకారం 10,68,743 కు టుంబాలే ఉండగా.. సర్వే తర్వా త భారీగా పెరిగాయి. జిల్లా వ్యాప్తంగా 34,465 ఇళ్లకు తాళం వేసినట్లు నమోదు చేశారు. మరో 3521 కుటుంబాలను మరణించినట్లుగా పేర్కొన్నారు.
వరంగల్ నగరంలో అధికారుల ప్రణాళిక లోపంతో దాదాపు 11వేల కుటుంబాల వివరాలు సేకరించలేదు. కాగా, సమగ్ర కుటుంబ సర్వే విజయవంతమైందని జిల్లా కలెక్టర్ జి.కిషన్ తెలిపారు. ‘వరంగల్ నగరంలోని కొన్ని మినహా సర్వే సమగ్రంగా పూర్తయింది. సర్వేకు సహకరించిన అందరికీ కృతజ్ఞతలు. మొత్తంగా మరో 12 శాతం సర్వే మిగిలింది.
ప్రభుత్వ ఆదేశాలు రాగానే వంద శాతం పూర్తి చేస్తాం’ అని కలెక్టర్ వివరించారు. సర్వే వివరాలను కంప్యూటర్‌లో నమోదు చేసే ప్రక్రియ మొదలువుతోంది. సర్వే వివరాల కంప్యూటరీకరణకు 2100 కంప్యూటర్లను ఏర్పాటు చేశారు. 2100 డాటా ఎంట్రీ ఆపరేటర్లను, పర్యవేక్షణకు 2100 వీఆర్వోలను నియమించనున్నారు. సమగ్ర సర్వేలో భాగంగా ఎన్యూమరేటర్లు సేకరించిన సమాచార పత్రాలను ప్రత్యేక బాక్స్‌లలో సీల్ చేసి హన్మకొండలోని ఇండోర్ స్టేడియంలో భద్రపరిచారు.
నగరంలో 98.75 శాతం
వరంగల్ నగరపాలక సంస్థ పరిధిలో 98.75 శాతం కుటుంబాల సామాజిక స్థితిగతులపై సర్వే నిర్వహించినట్లు అధికారులు వెల్లడించారు. ఎన్యూమరేటర్ల కొరత, రూట్ మ్యాపుల తయారీలో దొర్లిన తప్పిదాలతో మంగళవారం ఒక్కరోజే సర్వే పూర్తి కాలేదు. బుధవారం కూడా సర్వే నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్, కార్పొరేషన్ అధికారులు ప్రకటించారు. ప్రభుత్వ ఆదేశాలతో బుధవారం సర్వే ప్రక్రియ నిర్వహించ లేదు.
రాష్ట్ర ప్రభుత్వం నుంచి మళ్లీ ఆదేశాలు వచ్చిన తర్వాతే సర్వే చేయనున్నట్లు అధికారులు తెలిపారు. సర్వేలో భాగంగా వివరాలు నమోదుకాని 11వేల కుటుంబాల్లో 10 వేల కుటుంబాలకు సంబంధించిన ఇంటి నెంబర్లను, సెల్‌ఫోన్ నెంబర్లను అధికారులు బుధవారం నమోదు చేసుకున్నారు. తొమ్మిది శిక్షణ కేంద్రాలలో ఈ పని పూర్తి చేశారు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందగానే సర్వే చేస్తామని అప్పుడు ఈ కుటుంబాల వివరాలను సర్వే నమూనాలో పొందుపరుస్తామని కార్పొరేషన్ అధికారులు వివరించారు.
అందరికీ కృతజ్ఞతలు : టి.రవీందర్‌రావు
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేను విజయవంతం చేసిన జిల్లా ప్రజలకు టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు టి.రవీందర్‌రావు ఒక ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు. సంక్షేమ పథకాలను అర్హులకు అందించే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు నిర్ణయించిన సర్వే జిల్లాలో విజయవంతమైందని పేర్కొన్నారు. ప్రభుత్వ పిలుపు మేరకు ప్రజలు స్వచ్ఛందంగా తమ వివరాలను నమోదు చేసుకునేందుకు ఉత్సాహం చూపారని... ఇదే స్ఫూర్తి కొనసాగించాలని ఆయన కోరారు. సమగ్ర సర్వేను పకడ్బందీగా నిర్వహించిన ప్రభుత్వ యంత్రాంగానికి, ప్రభుత్వ ఉద్యోగులకు, ప్రైవేటు సిబ్బందికి అభినందనలు తెలిపారు.