సుల్తాన్‌బజార్(హైదరాబాద్): అందరి భవిష్యత్తు చెప్పే జ్యోతిష్యుని ఇంటికే కన్నం వేసి, అతని భవిష్యత్తునే అయోమయం చేశారు దొంగలు. ఆదివారం సుల్తాన్‌బజార్ పోలీసుస్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటనపై ఇన్‌స్పెక్టర్ శివశంకర్ కథనమిదీ.. ఇసామియా బజార్‌కు చెందిన కమల్‌కిషోర్‌శర్మ(55) జ్యోతిష్యం చెబుతూ జీవనం సాగిస్తున్నాడు. శనివారం రాత్రి తన ఇంటికి తాళంవేసి ఓ దేవాలయంలో జరిగే భజన కార్యక్రమానికి వెళ్లాడు. ఆదివారం ఉదయం 6 గంటలకు తిరిగి వచ్చి చూడగా ఇంటి తాళం పగలగొట్టి.. లోపలి వస్తువులన్నీ చిందరవందరగా పడి ఉన్నాయి. బీరువాలో ఉన్న 7 తులాల బంగారం, 12 లక్షల నగదు మాయమయ్యాయి.
దీంతో ఆయన పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.