
వెంకటాపురం (కే): జయశంకర్ భూపాలపల్లి జిల్లా వెంకటాపురం మండల పరిధిలోని పాత్రాపురం సమీప పాలెం ప్రాజెక్టు వరద నీటిలో 15 మంది కూలీలు చిక్కుకున్నారు. వారిని సమీప తోటల్లోకి కూలీలు తాళ్ల సహాయంతో వారిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. మండల పరిధిలోని పాత్రాపురానికి చెంది 15 మంది కూలీలు పాలెం వాగు గుండా అవతలి వైపున గడ్డపై వేసిన మిర్చి తోటల్లో పని చేసేదుకు ట్రాక్టర్‌పై వెళుతున్నారు. అయితే, వాగులోకి వెళ్లగానే ట్రాక్టర్ ఆగి పోయింది.
అదే సమయంలో పాలెం ప్రాజెక్టు గేట్ నుంచి 11 వేల క్యూ సెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. దీంతో కూలీలు ప్రయాణిస్తున్న ట్రాక్టర్ వరద నీటిలో చిక్కుకుంది. ప్రమాదాన్ని పసిగట్టిన కూలీలు గట్టిగా అరిచారు. అదే సమయంలో ట్రాక్టర్ వరద నీటిలో మునిగిపోయింది. కాగా, కూలీల అరుపులను విన్న సమీప తోటల్లో పనిచేస్తున్న కూలీలు అందుబాటులో ఉన్న తాళ్లను ఒక దానికి ఒకటి కట్టి వారికి అందించారు. దీంతో తాడును పట్టుకుని వారు ఒడ్డుకు చేరారు. తర్వాత ట్రాక్టర్‌ను జేసీబీ, కూలీల సాయంతో ఒడ్డుకు చేర్చారు. కాగా, ప్రాజెక్టు నీటిని విడుదల చేస్తున్నట్లు ఎలాంటి హెచ్చరికలను చేయలేదని కూలీలు చెబుతుండగా.. తాము అలారం మోగించే నీటిని విడుదల చేశామని ఏఈ వలీ మహ్మద్ తెలిపారు.