సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఏటా వేలాది మంది విద్యార్థులు చదువులకు దూరమవుతున్నారు.. పదో తరగతి, ఇంటర్ పాసైనా పైచదువులకు వెళ్లకుండా పని బాట పడుతున్నారు. ఓవైపు కుటుంబ పరిస్థితులు, ఆర్థిక ఇబ్బందులు ఈ పరిస్థితికి కారణంకాగా.. విద్యార్థుల్లో పైచదువులపై అవగాహన లోపం, సామర్థ్యాల లేమి మరో కారణంగా నిలుస్తోంది. ముఖ్యంగా ఏటా ఇంటర్మీడియట్ తర్వాత సగటున 15 శాతం మంది చదువు ఆపేస్తుండడం ఆందోళనకరమైన అంశం. విద్యాశాఖ లెక్కలే ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.
మూడేళ్ల లెక్కలు చూస్తే..
ఇంటర్ పూర్తయ్యాక చదువు మానేస్తున్నవారి శాతం కొన్నేళ్లుగా దాదాపు ఒకే స్థాయిలో ఉంటోంది. 2016–17లో ఉత్తీర్ణులైన మొత్తం ఇంటర్ విద్యార్థుల్లో 14 శాతం మంది డ్రాపౌట్స్‌గా మిగిలిపోగా... 2015–16లో 17 శాతం మంది.. 2014–15లో 15 శాతం మంది పై చదువులకు వెళ్లలేదు.
ఇక పదో తరగతికి వస్తే.. 2016–17 విద్యా సంవత్సరంలో పదో తరగతి పూర్తయిన వారిలో 4.95 శాతం మంది పైచదువులకు దూరంకాగా.. 2015–16లో 6 శాతం మంది, 2014–15లో 7 శాతం మంది డ్రావుట్స్‌గానే మిగిలిపోయారు.
ఇంటర్ తర్వాత భారీగా..
రాష్ట్రవ్యాప్తంగా 2016–17 విద్యా సంవత్సరంలో ఇంటర్ ద్వితీయ సంవత్సర పరీక్షలకు 4,14,213 మంది హాజరుకాగా.. అందులో 3,38,903 మంది ఉత్తీర్ణత సాధించారు. వీరిలో 2,91,088 మంది వివిధ కోర్సుల్లో చేరగా.. 47,842 మంది వివిధ కారణాలతో చదువుకు దూరమయ్యారు. ఇక ఇంటర్ తరువాత వివిధ వృత్తి విద్యా కోర్సుల్లో 1,00,701 మంది చేరగా.. అందులో 10 శాతం మంది ఏపీ సహా ఇతర రాష్ట్రాల విద్యార్థులు ఉన్నట్లు అంచనా. అంటే 90,631 మంది రాష్ట్రవిద్యార్థులు వివిధ వృత్తి విద్యా కోర్సులు చేస్తున్నారు. ఇక డిగ్రీ కోర్సుల్లో 2,00,457 మంది చేరారు.
‘పది’తోనే ఆగిపోయిన 23,820 మంది
2016–17 విద్యా సంవత్సరంలో పదో తరగతి పరీక్షలకు 5,97,064 మంది హాజరుకాగా.. అందులో 4,80,831 మంది ఉత్తీర్ణులయ్యారు. వీరిలో 3,99,377 మంది ఇంటర్‌లో, 26,594 మంది ఐటీఐలలో, 31,040 పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో చేరారు. మొత్తంగా పదో తరగతి పూర్తయిన వారిలో... 4,57,011 మంది వివిధ కోర్సుల్లో చేరగా 23,820 మంది చదువును ఆపేసినట్లు ఉన్నత విద్యా మండలి లెక్కలు వేసింది.
2017–18లో ఇంటర్ తరువాత వివిధ కోర్సుల్లో చేరినవారు
కోర్సు చేరినవారు
బీటెక్ 68,593
బీఫార్మసీ 6,500
డీఎడ్ 10,200
ఎంబీబీఎస్ 3,200
బీడీఎస్ 1,400
ఆయుష్ 695
అగ్రికల్చర్, వెటర్నరీ 500
జాతీయ విద్యా సంస్థలు, విదేశీ చదువుకు వెళ్లిన వారు 9,612
బీఏలో చేరిన వారు 25,599
బీబీఎం 306
బీబీఏ 1,762
బీసీఏ 336
బీకాం 80,696
బీఎస్సీ 91,702
బీఎస్‌డబ్ల్యూ 36
డిగ్రీ వొకేషనల్ 20
ఇదీ చదువుల దుస్థితి..
పదో తరగతి స్థాయి నుంచి..
సంవత్సరం పాసైనవారు పైకోర్సుల్లోకి డ్రాపౌట్
2014–15 4,44,828 4,13,691 31,137
2015–16 4,37,192 4,10,961 26,231
2016–17 4,80,831 4,57,011 23,820
ఎందుకు ఆపేస్తున్నారు?
– పదో తరగతి తరువాత చదువు ఆపేస్తున్న వారిలో ఎక్కువ మంది ఆర్థిక ఇబ్బందులతోనే మానేస్తున్నట్లు గుర్తించారు.
– ఇంటర్ పూర్తయిన వారు మాత్రం ఆర్థిక ఇబ్బందులతోపాటు కుటుంబ పోషణ భారం మీద పడటంతో చదువులకు దూరమవుతున్నట్లు తేల్చారు.
– ఇక పైచదువులకు తగిన సామర్థ్యాలు కొరవడటంతో.. తాను ఇక చదవలేన్న ఆలోచన, ఆత్మన్యూనతా భావంతో చదువు మానేస్తున్నవారి సంఖ్యా ఎక్కువగానే ఉంది. దీంతో ఏదో ఒక పని చేసుకుని బతుకుదామన్న ధోరణితో చదువుకు దూరమవుతున్నారు.
– పై చదువులపై అవగాహన లోపం కూడా కొందరు విద్యార్థులు దూరమవడానికి కారణంగా గుర్తించారు.
– పదో తరగతి తర్వాత చదువు మానేస్తున్నవారిలో చాలా మందికి పైచదువులకు వెళ్లాలన్న కోరిక ఉన్నా... పరిస్థితుల కారణంగా వెనక్కి తగ్గుతున్నట్లు విద్యారంగ నిపుణులు పేర్కొంటున్నారు.
డ్రాపౌట్స్ తగ్గించేలా చర్యలు చేపట్టాలి..
‘‘పదో తరగతి, ఇంటర్ తరువాత విద్యార్థులు చదువు మానేయడం మంచిదికాదు. కొద్దిగా కష్టపడి చదువుకుంటే భవిష్యత్తు బాగుంటుంది. ప్రభుత్వం కూడా డ్రాపౌట్లను తగ్గించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలి..’’ – ఇంటర్ విద్యా జేఏసీ కన్వీనర్ పి.మధుసూదన్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment