స్థానికతకు 15 ఏళ్లు చాలు: సీఎల్పీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో 15 ఏళ్లు స్థిర నివాసం ఉన్న వారందరినీ స్థానికులుగా పరిగణించాలని సీఎల్పీ డిమాండ్ చేసింది. ఈ విషయంలో నిజాం పాలనలో కొనసాగిన ‘ముల్కీ’ నిబంధనలే ప్రామాణికంగా పరిగణించాలని సూచించింది. సీఎల్పీ కార్యాలయంలో శుక్రవారం శాసనమండలిలో కాంగ్రెస్ ఉపనేత షబ్బీర్‌అలీ, ఎమ్మెల్యే భట్టి విక్రమార్కలతో కలసి సీఎల్పీ నేత కె.జానారెడ్డి మీడియాతో మాట్లాడారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే...
- పోలవరం ఆర్డినెన్స్‌ను పార్లమెంట్‌లో చట్టంగా ఆమోదించడాన్ని నిరసిస్తున్నాం. పోలవరం డిజైన్ మారిస్తే సమస్య పరిష్కారమవుతుంది. తక్షణమే రెండు రాష్ర్ట ప్రభుత్వాలతో కేంద్రం చర్చించాలి.
- ఆర్‌డీఎస్ ఎత్తు పెంచాలని గతంలో తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా కర్ణాటక చేపడుతున్న పను లను కర్నూలువాసులు అడ్డుకోడం సరికాదు. పోలీ సుల రక్షణతోనైనా ఈ పనులను చేపట్టాలి.
- 1956కు పూర్వం తెలంగాణలో స్థిరపడిన వాళ్లు తెలంగాణ బిడ్డలేనని టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రతిపా
దిస్తే, ఒక ప్రాంతానికి వ్యతిరేకమనే భావన ఇక్కడ స్థిరపడినవారిలో కలిగే ప్రమాదముంది. తెలంగాణలో
స్థిరపడిన వాళ్లంతా తెలంగాణ బిడ్డలేనంటూ ఎన్నికల్లో హామీ ఇచ్చిన విషయాన్ని మర్చిపోవద్దు.
రెండ్రోజుల్లో సీఎల్పీ కార్యవర్గం
కాంగ్రెస్ శాసనసభాపక్ష కార్యవర్గాన్ని రెండురోజుల్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు జానారెడ్డి విలేకరులకు తెలిపారు. డిప్యూటీ లీడర్లు, కార్యదర్శులు, కోశాధికారి, కార్యవర్గ సభ్యుల ఎంపికపై కసరత్తు చేస్తున్నట్టు ఆయన చెప్పారు.