
సాక్షి, హైదరాబాద్: నిరుద్యోగులకు శుభవార్త. తెలంగాణ రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ (ట్రాన్స్‌కో)లో 1,604 పోస్టుల భర్తీకి శుక్రవారం ప్రకటన వెలువడనుంది. 330 అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ), 174 సబ్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్), 1,100 జూనియర్ లైన్‌మెన్ (జేఎల్‌ఎం) పోస్టుల భర్తీకి ట్రాన్స్‌కో ప్రకటన జారీ చేయనుంది. గురువారం విద్యుత్ సౌధలో ట్రాన్స్‌కో, జెన్‌కో సంస్థల సీఎండీ ప్రభాకర్‌రావు నేతృత్వంలో సమావేశమైన సంస్థ పాలక మండలి ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
330 అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టుల్లో 250 ఎలక్ట్రికల్, 49 సివిల్, 31 టెలికాం విభాగాల పోస్టులు ఉండనున్నాయి. ఆయా విభాగాల్లో ఇంజనీరింగ్ పూర్తి చేసిన అభ్యర్థులు ఏఈ పోస్టులకు, ఎలక్ట్రికల్ విభాగంలో డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు సబ్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. నిరుద్యోగ అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న ప్రత్యేక వయోపరిమితి సడలింపు నిబంధనలను విద్యుత్ ఉద్యోగాల భర్తీలోనూ అమలు చేయనున్నట్లు ప్రభాకర్‌రావు తెలిపారు.
తెలంగాణ విద్యుదుత్పత్తి సంస్థ (జెన్‌కో)లో ప్రస్తుతం ఖాళీలు లేవని, కాబట్టి జెన్‌కో నుంచి నియామక ప్రకటన ఉండదని పేర్కొన్నారు. కాగా, దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్‌ఎస్పీడీసీఎల్), ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్‌ఎన్పీడీసీఎల్)ల నుంచి కూడా జేఎల్‌ఎం, ఏఈ, సబ్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి వారం పది రోజుల్లో వేర్వేరు ప్రకటనలు జారీ కానున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment