
ఎన్నికల చుట్టే రాజకీయం
అన్ని ఎన్నికలూ ఒకే ఏడాది.. సార్వత్రిక ఎన్నికల నుంచి పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్, జెడ్పీ, ఎంపీపీ... ఇలా అందరి ఎన్నికా
సాక్షిప్రతినిధి నల్లగొండ :అన్ని ఎన్నికలూ ఒకే ఏడాది.. సార్వత్రిక ఎన్నికల నుంచి పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్, జెడ్పీ, ఎంపీపీ... ఇలా అందరి ఎన్నికా ఒకే సంవత్సంలోనే.. ఎన్నికలకు తోడు నూతన రాష్ట్ర ఆవిర్భావం.. దేశంలో 29వ రాష్ట్రంగా నవతెలంగాణ రాష్ట్రం సిద్ధించింది కూడా ఈ వత్సరంలోనే... రాజకీయ నాయకుల రాతలు మారి ఓడలు బండ్లు... బండ్లు ఓడలు అయి జిల్లాలో ఓ వెలుగు వెలిగిన నేతలు ప్రభ కోల్పోవడం.. గతంలో ఎలాంటి ప్రభావం చూపని నేతలు ఇప్పుడు కీలకంగా మారింది కూడా ఈ 12 నెలల్లోనే.. ముఖ్యంగా 1973 తర్వాత తొలిసారి రాష్ట్రపతిపాలన వచ్చింది కూడా ఈ ఏడాదిలోనే... అదే 2014...
జనవరి నుంచి డిసెంబర్ వరకు ప్రతి నెలా ఏదో రాజకీయ సంచలనమే.... ఏడాదంతా రాజకీయ పరిణామాలే... కొన్ని అనూహ్యమైతే.. మరికొన్ని ఊహిం చినవి.. ఇంకొన్ని ఆశించినవి.. ఏవైతేనేమి జరిగిందంతా మన మంచికే అన్నట్టు ఈ పరిణామాలు జిల్లా రూపురేఖలు మార్చే దిశలో వెళుతున్నాయి. నూతన రాష్ట్రంలో నల్లగొండ జిల్లా అగ్రగామిలో నిలిచేందుకు ఈ ఏడాది వేదికైందనే చెప్పాలి. మొత్తంమీద జనవరి నుంచి డిసెంబర్ వరకు రాజకీయంగా బిజీబిజీ అయిన ఈ ఏడాదికి తెలుగు క్యాలెండర్ ఆధారంగా ఏ పేరు పెట్టినా.. ఘటనల పరంగా ‘తెలంగాణ పేరు పెట్టాల్సిందే... తెలంగాణ నామ సంవ
త్సరంగా కీర్తికెక్కనున్న ఈ ఏడాదిలో జిల్లాలో జరిగిన రాజకీయ పరిణామాలను ఓసారి అవలోకనం చేసుకుందామా!
అనూహ్యం... అద్భుతం
ఈ ఏడాది జరిగిన రాజకీయ పరిణామాలు ఎన్ని ఉన్నా ముఖ్యంగా చెప్పుకోవాల్సింది తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం గురించే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పడిన రోజు నుంచే రూపుదాల్చిన ప్రత్యేక రాష్ట్ర పోరాటం ఆరుదశాబ్దాల తర్వాత 2014లో ఫలించింది. ఈ పోరాటాలకు ఆది నుంచీ అండగా ఉన్నది నల్లగొండ జిల్లా. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నుంచి మలిదశ తెలంగాణ ఉద్యమం వరకు అగ్రగామిగా పోరాటాలు చేసింది జిల్లా ప్రజానీకం. ఇక, మలిదశ ఉద్యమంలో మన పాత్ర మరువలేనిది. ఎంతగా అంటే తెలంగాణ రాష్ట్రం కోసం అమరులైన వారి పేర్లు చెప్పాలంటే ఇప్పుడు తెలంగాణ పదిజిల్లాలు చెప్పే పేరు మనజిల్లావాసి శ్రీకాంతాచారిదేనని గర్వంగా చెప్పుకోక తప్పదు. ఆ స్థాయిలో నల్లగొండ జిల్లాకు తెలంగాణ ఉద్యమంలో ఎంతో ఖ్యాతి లభించింది. అమరుల పోరాట ఫలంతో సిద్ధించిన తెలంగాణ రాష్ట్రంలో మన జిల్లా ఎంతో అభివృద్ధి చెందాలని ఆశిద్దాం.
కొత్త రాష్ట్రం.. తొలి పదవి
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత జిల్లాకు తొలి విస్తరణలోనే కేబినెట్ మంత్రి పదవి దక్కడం ఈ ఏడాదిలో జరిగిన కీలక రాజకీయ పరిణామంగానే చెప్పుకోవాలి. సూర్యాపేట నియోజకవర్గం నుంచి టీఆర్‌ఎస్ తరఫున గెలిచిన గుంటకండ్ల జగదీష్‌రెడ్డికి రాష్ట్ర విద్యాశాఖ బాధ్యతలు అప్పగిస్తూ కేబినెట్ మంత్రి హోదా ఇచ్చారు కేసీఆర్. టీఆర్‌ఎస్ అధినాయకుడు కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడిగా పేరుగడించిన జగదీష్‌రెడ్డికి మంత్రి పదవి లభించడం అనూహ్యమేమీ కాకపోయినా తెలంగాణలో తొలి రాష్ట్ర మంత్రిగా ఆయనకు అవకాశం దక్కడం గమనార్హం.
కుదేలైన టీడీపీ
జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఈ ఏడాది కుదేలయిందనే చెప్పాలి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ సమయంలో చంద్రబాబు నాయుడు వైఖరి ఆ పార్టీకి కష్టాలు తెచ్చిపెట్టిందనే చెప్పాలి. దీనికి తోడు జిల్లా పార్టీలోని గ్రూపు గొడవలు.. ఇక ఆ తర్వాత టీఆర్‌ఎస్ హవా.. అన్నీ కలిపి టీడీపీ కార్యాలయాన్ని తగులబెట్టే వరకు పరిస్థితులు వచ్చి ఆ పార్టీ ఉనికిని ప్రశ్నిస్తోన్న సంవత్సరం కూడా 2014. ఉన్న నేతల్లో ఐక్యత లేకపోవడం, పార్టీ కేడర్‌కు భరోసానిచ్చే వారు లేక కొంత స్తబ్ధత నెలకొంది.