సాగుకు 24 గంటల విద్యుత్‌పై మంగళవారం ప్రగతిభవన్‌లో సమీక్షిస్తున్న సీఎం కేసీఆర్. చిత్రంలో మంత్రులు హరీశ్, జగదీశ్‌రెడ్డి తదితరులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ సరఫరాతో పడే భారాన్ని ప్రభుత్వమే భరిస్తుందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు విద్యుత్ సంస్థలకు హామీ ఇచ్చారు. జనవరి ఒకటి నుంచి వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ ఇవ్వాలని, ఈ ఏడాది బడ్జెట్ నుంచే నిధులు ఇస్తామని హామీ ఇచ్చారు. వచ్చే బడ్జెట్ నుంచి విద్యుత్ సబ్సిడీలకు అదనపు కేటాయింపులు చేస్తామన్నారు. దీనితోపాటు వచ్చే ఏడాది నుంచి ప్రారంభమయ్యే ఎత్తిపోతల పథకాల విద్యుత్ బిల్లులను కూడా ప్రభుత్వం నూటికి నూరు శాతం చెల్లిస్తుందని చెప్పారు. వచ్చే వర్షాకాలం నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఎత్తిపోతలు పనిచేస్తాయని, అందుకు సిద్ధంగా ఉండాలని విద్యుత్ అధికారులకు సూచించారు. క్రమశిక్షణతో నడుస్తున్న విద్యుత్ సంస్థలను కాపాడుకుంటామన్నారు. మంగళవారం ప్రగతిభవన్‌లో 24 గంటల విద్యుత్ అంశంపై కేసీఆర్ సమీక్షించారు. 24 గంటల విద్యుత్ సరఫరాతో లాభనష్టాలు, సవాళ్లపై చర్చించారు.
అవగాహన కోసం కార్యక్రమాలు
రైతులు ఆటోస్టార్టర్లు తొలగించుకుంటేనే నిరంతర కరెంటుతో లాభం జరుగుతుందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. లేకుంటే భూగర్భ జలాలు అడుగంటిపోతాయని.. పంట పొట్టకొచ్చిన సమయంలో నీళ్లులేక ఎండిపోయే దుస్థితి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆటోస్టార్టర్ల వల్ల కలిగే అనర్థాలను విడమరిచి చెబితే రైతులు అర్థం చేసుకుంటారని.. వారు తమను తాము నష్టపరుచుకునేలా వ్యవహరించరనే నమ్మకం తనకుందని చెప్పారు. ఆటోస్టార్టర్లు తొలగించేలా వ్యవసాయ, విద్యుత్ శాఖల అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు గ్రామాల్లో పర్యటించి రైతులకు నచ్చజెప్పాలని, ఇందులో భాగంగా సభలు నిర్వహించాలని సూచించారు. అంతేగాకుండా పంటలకు అవసరమైన మేరకే మోటార్లతో నీరు తోడుకునేలా అవగాహన కల్పించాలని చెప్పారు. డిసెంబర్ 31 రాత్రి 12:01 గంటల సమయం నుంచి 24 గంటల విద్యుత్ సరఫరాను ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. సమీక్షలో మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు రాజీవ్‌శర్మ, ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు, సీఎస్ ఎస్‌పీ సింగ్, ట్రాన్స్‌కో జేఎండీ శ్రీనివాసరావు, డిస్కంల సీఎండీలు గోపాల్‌రావు, రఘుమారెడ్డి, డైరెక్టర్లు నర్సింగ్‌రావు, శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీ బాల్క సుమన్, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా, ముఖ్యకార్యదర్శులు ఎస్.నర్సింగ్ రావు, రామకృష్ణారావు, శాంతకుమారి తదితరులు పాల్గొన్నారు.
ఆటో స్టార్టర్లతో నష్టం
ఉమ్మడి రాష్ట్రంలో రైతులంతా ఆటో స్టార్టర్లు పెట్టుకున్నారని.. ఇప్పుడు 24 గంటల విద్యుత్ సరఫరా ఇస్తే మోటార్లు 24 గంటల పాటు నడుస్తాయని అధికారులు పేర్కొన్నారు. దీంతో భూగర్భ జలాలు అడుగంటి, పంటలు ఎండిపోయే పరిస్థితి వస్తుందని చెప్పారు. ఎక్కువ లోతున్న బోర్ల వల్ల తక్కువ లోతున్న బోర్లకు నష్టం వాటిల్లుతుందని... గ్రామాల్లో రైతుల నుంచి ఈ రెండు విషయాల్లోనే ఫిర్యాదులు, అభ్యంతరాలు వస్తున్నాయన్నారు. స్పందించిన సీఎం.. ఆటోస్టార్టర్ల కారణంగా రైతులకు మేలుకన్నా కీడే ఎక్కువ జరుగుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోందని చెప్పారు. అందువల్ల ఆటోస్టార్టర్లు తొలగించుకోవాలని రైతులకు పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment